Revanth and Jagan : పెట్టుబడులను సాధించడంలో రేవంత్, జగన్ లకు ఉన్న తేడా ఇదే!
Revanth and Jagan : ఒక రాష్ట్ర, ఒక దేశ అభివృద్ధి నిబద్ధత కలిగిన పార్టీలు, నేతలతోనే సాధ్యమవుతుంది. సంక్షేమ పథకాలు జల్లితే చాలు మరోసారి గెలిచిపోతాము..ఇక అభివృద్ధి ఎందుకు అనే పార్టీల వల్ల ఆ రాష్ట్రాలు ఎంత అధ్వానస్థితికి వెళ్లిపోతాయో చెప్పలేం. పార్టీలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకుంటూ పోతే ఇక ఆ రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరు. గత ప్రభుత్వం చేసిన విధానాల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటూ ఆ సమయానికి ఉన్న పరిస్థితులను బట్టి వెళ్లడం వల్లే ఏ రాష్ట్ర అభివృద్ధి అయినా వేగంగా ముందుకెళ్తుంది. అక్కడే సుస్థిర అభివృద్ధి కొనసాగుతుంది.
తెలంగాణలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధి విషయంలో ఇదే విధంగా ముందుకు సాగుతుండడం విశేషం. అందుకే సీఎం పదవి చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ తన టీమ్ తో కలిసి దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లి రాష్ట్రానికి సుమారు 30-40 వేల కోట్లు పెట్టుబడులు సాధించుకువచ్చారు. అదే విధంగా గత ప్రభుత్వం హయాంలో పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవిస్తూ పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
ఇక రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో చేసుకున్నా ఒప్పందం కూడా అలాంటిదే. దీనిని సాధించడం కోసం గతంలో కేసీఆర్ ప్రభుత్వం గట్టిగా కృషి చేయగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ సంస్థను సాదరంగా రాష్ట్రానికి ఆహ్వానించి తాజాగా ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ తెలంగాణలో రూ.6వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టి దక్షిణాది రాష్ట్రాలలోనే అతిపెద్ద సోలార్ పీవీ మాడ్యుల్స్, పీవీ సెల్స్ తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేయబోతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు. ఇంత తక్కువ వ్యవధిలోనే రూ.6వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద పరిశ్రమను సాధించుకుంది. ఇక ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు 5 ఏండ్లవుతోంది. త్వరలో పదవీ కాలం పూర్తవబోతోంది కూడా. కానీ ఏపీ రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు, ఎన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఐటీ కంపెనీలను ఆకర్షించగలిగింది? అంటే జవాబు అందరికీ తెలుసు.
కొత్త వాటిని తీసుకురాకపోగా..ఉన్న అమర్ రాజా బ్యాటరీస్, లూలూ గ్రూప్ వంటి అనేక సంస్థలను బయటకు వెళ్లిపోయేలా చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు రాకపోయినా ఏం ఫర్వాలేదు. అందరికీ సంక్షేమ పథకాలతో ‘మేలు’ చేస్తున్నామని వైసీపీలో పైనుంచి కింది దాక నిసిగ్గుగా చెప్పుకోవడం వారికే చెల్లింది.
కొత్త ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేయకుండా పక్కనపడేస్తే ఆ రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా మారుతుందో ఏపీని చేస్తే అర్థమవుతుంది. అదే గత ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను అవసరమైన మేరకు మార్పులు, చేర్పులు చేసుకుని ముందుకెళ్తే ఎలా ఉంటుందో పక్క రాష్ట్రాన్ని చూస్తే తెలిసిపోతుంది. పాలకులు శాశ్వతం కాదు వారి పనితీరే శాశ్వతమని ఈ నేతలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో.