JAISW News Telugu

Flag on August 15th : ఆగస్టు 15నాడు జెండా ఎగురవేయడానికి.. జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?

Flag on August 15

Flag on August 15

Flag on August 15th: భారతదేశం బ్రిటిష్ వారి చెర నుంచి  ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం పొందడం ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతిఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.

అయితే ఆగస్టు 15న జెండా ఎగురవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతీ సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆరోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.

ఇక గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న  రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీల్లో జెండాను రెపరెపలాడిస్తారు. జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కు పైన కట్టి ఉంచుతాము. కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుంచి పైకి లాగమనేది గమనించాలి.

దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంట్ కు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి కూడా ఒక కారణం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికీ రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.

ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే..స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.  స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

Exit mobile version