YCP Leaders : అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదా టీడీపీ వాళ్ల బాధ?
YCP Leaders : ఏపీలో వైసీపీ అరాచక పాలనను అంతమొందించి టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఇవాళ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ కూటమిలో సంబరాలు జరుగుతున్న వేళ..వైసీపీ నేతలు తమపై టీడీపీ దాడులు చేస్తోందని ఢిల్లీలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఢిల్లీలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు ప్రెస్ మీట్ పెట్టి..ఏపీలో శాంతిభద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు.
వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని, బాధితుల ఆక్రందనలు చంద్రబాబు కనిపించడం లేదని వైసీపీ నేతలు చెప్పారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి..వెళ్లాయి..కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని, వైసీపీ కార్యకర్తలు, వాళ్ల ఆస్తులే లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారన్నారు. ఇది చీకటి ఆధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లపై దాడులు చేసి, సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేశ్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్తలపై అమానుషంగా ప్రవర్తించారన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలని, రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలన్నారు. పీఎం, హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు.
కాగా, వైసీపీ నేతల మాటలపై పలువురు మండిపడుతున్నారు. ఓటమిని తట్టుకోలేకే టీడీపీపై అభాండాలు వేస్తున్నారన్నారు. గతంలో వైసీపీ దాడుల వల్ల ఎంతో మంది టీడీపీ నేతలు చనిపోయిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. అధికార మత్తులో ఐదేండ్లుగా చేసిన అరాచకం, లేనిపోని ఆరోపణలతో చంద్రబాబును జైలులో వేయడం, లోకేశ్ ను సోషల్ మీడియాలో అవమానించడం లాంటి వికృత చర్యలు చేసిన వైసీపీ.. అధికారం పోగానే సొక్కంపూసలాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేసిన, ఎదుటివారిని దూషించినా తప్పేనని..తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం శిక్ష విధిస్తుందని అంటున్నారు. చంద్రబాబు రివేంజ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటామని గెలిచిన నాటి నుంచి చెప్తున్నారని వారు గుర్తు చేశారు. ఐదేండ్లుగా అన్ని రంగాల్లో చితికిపోయిన రాష్ట్రాన్ని గాడీలో పెట్టడమే ప్రస్తుతం సీఎం చంద్రబాబు కర్తవ్యమని చెప్తున్నారు. వైసీపీ ఆరోపణలను ప్రజలు నమ్మరని అంటున్నారు.