IAS Praveen Prakash : ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయన అమరావతిలోని సెక్రటేరియట్ లో కొత్త కార్యదర్శి కోన శశిధర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆ శాఖ నుంచి బదిలీపై వెళుతున్న సందర్భంగా.. ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చారు.. తాను విద్యాశాఖ పురోగతి కోసం పనిచేశానన్నారు. తాను తనిఖీలతో టీచర్లు, సిబ్బందిని అవమానించానంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని.. తాను అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకే అలా మాట్లాడానని.. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి, ప్రార్థిస్తున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. దయచేసి వాటిని మనసులో ఉంచుకోవద్దని కోరారు.. మరో మనిషిని అవమానించే గుణం తనది కాదన్నారు.
రెండు రోజుల క్రితం ఏపీలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌లను జీఏడీకి అటాచ్ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ నియామకం అయ్యారు. శశిధర్‌కు ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటుగా మరికొందరు ఐఏఎస్‌లను కూడా ప్రభుత్వ బదిలీ చేసింది.
తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సర్కార్ బదిలీ చేసింది. ముగ్గురిలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే అతుల్ సింగ్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించగా.. పీవీ సునీల్‌కుమార్‌ను సాధారణ పరిపాలనశాఖకు రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అగ్నిమాపకశాఖ డీజీగా శంకబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ రిషాంత్‌రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అలాగే రిషాంత్ రెడ్డిని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ బాధ్యతల నుంచీ రిలీవ్ చేశారు.