YSRCP Party:కొట్టు కనిపించిందా..వైకాపా బోర్డు పెట్టు!
YSRCP Party:ఏపీలో అధికార వైకాపా పార్టీ ఎక్కడ షాప్ కనిపిస్తే అక్కడ బోర్డ్ పెట్టేస్తోంది. టిడ్కో నివాసాలు, మంచినీళ్ల ట్యాంకులు, ప్రభుత్వ భవనాలకు ప్రజాధనం వెచ్చించి నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే తమ పార్టీ రంగులు వేసుకున్న వైకాపా..తాజాగా చిన్న తరహా దుకాణాల వద్ద వారి పార్టీకి సంబంధించిన మల్టీకలర్ ఎల్ఈడీ ఫ్లెక్సీ బోర్డులు అమర్చుతున్నారు. అంతులో వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రాలతో పాటు పార్టీ నినాదాలు జత చేస్తున్నారు.
ఈ బోర్డులు పెట్టుకుంటే సంక్షేమ పథకాలు, వ్యాపార అవసరాలకు రుణ సదుపాయం వస్తుందనే భరోసా కల్పించి వారిని నమ్మబలుకుతున్నారు. ఆసక్తి చూపని వారిని పలు రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పలు దుకాణాదారులను ప్రశ్నించగా.. బోర్డులు పెట్టుకోవాలని వైకాపా నేతలు చెప్పడంతో చేసేది లేక ఒప్పుకొన్నట్లు సమాధానమిస్తున్నారు.
జీవీఎంసీ జోన్ -2 పరిధిలోని సాగర్‌నగర్ ప్రాంతాల్లో ఇదే తరహా సుమారు 20కి పైగా దుకాణాల వద్ద శుక్రవారం ప్రచార బోర్డులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచార సాధనంగా వినయోగించుకోవాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. ఒక్కో బోర్డు ఏర్పాటుకు సుమారు రూ.4 వేల ఖర్చు అవుతుందని అంచనా.