Joint Capital : హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామంటూ వైసీపీ దిగ్గజ నేతలు కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఐదేళ్లుగా ఏపీలో పాలన చేస్తున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. మరి ఈ ఉమ్మడి రాజధానిలో ఐదేళ్లుగా తమకు ఉన్న ఏ హక్కులను అనుభవించారు. ఏ హక్కులను సాధించారు.. పోనీ ఐదేళ్లలో ఎప్పుడైనా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని అసలు గుర్తించారా? అంటే లేనే లేదని చెప్పవచ్చు.
కరోనా టైంలో ఏపీ నుంచి అంబులెన్స్ లు వెళ్తుంటే కనీస మానవత్వం లేకుండా కేసీఆర్ నిలిపివేయించారు. మా ఉమ్మడి రాజధానికి మేము వెళ్తుంటే.. అడ్డుకోవడానికి మీరేవెరు? అని ఏ ఒక్క వైసీపీ నేత అయిన ప్రశ్నించాడా? సీఎం జగన్ రెడ్డి చిద్విలాసంగా కేసీఆర్ తో రాజకీయ ముచ్చట్లు పెట్టుకున్నారు కానీ .. మా ఉమ్మడి రాజధానిలోకి అంబులెన్స్ లు పంపకుండా ఆపుతారా? అని ఏనాడూ అడగలేదు. చివరకు కోర్టులోనూ ఆ వాదన వినిపించలేదు. అది ఒక్కటే కాదు.. అలాంటివి ఎన్నో జరిగాయి.. కానీ ఏనాడు తమ రాష్ట్రానికి కూడా హైదరాబాద్ రాజధాని అన్న విషయం గమనంలోనే ఉంచుకోలేదు.
ఇప్పుడు ఎన్నికల ముందు ఉమ్మడి రాజధాని గడువు తీరిపోయే సమయంలో ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బయలుదేరారు. ఒకవేళ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను చేస్తే ఏం చేస్తారు? అక్కడ్నుంచి ఏపీ ప్రభుత్వం ఏం పాలన చేస్తుంది? ఏ వ్యవహారాలు చక్కబెట్టాలనుకుంటోంది? గత ఐదేళ్లుగా ఉన్న భవనాలను ఇచ్చేశారు. మరి ఇంకేందుకు ఉమ్మడి రాజధాని కొనసాగింపు? తప్పుడు రాజకీయాల కోసం తప్పితే! ఒక్క రాజధాని డెవలప్ చేయమంటే చేయని వారు మూడు రాజధానులు అన్నారు.. మళ్లీ మరో రాజధాని కోసం డిమాండ్ చేస్తారట. అవన్నీ మానుకుని ఏపీకి ఒక్క రాజధానిని హైదరాబాద్ ను తలదన్నేలా డెవలప్ చేస్తే చాలు.