Kodali Nani : పరుష పదజాలానికి, బూతు పురాణాలకు బ్రాండ్ అంబాసిడర్ కొడాలి నాని. మైక్ దొరికితే చాలు పక్కన ఎవరున్నారు అనేది చూడరు..తనకంటే పెద్దవారినైనా సరే ఏ మాత్రం గౌరవం లేకుండా..రాజకీయ హుందాతనం లేకుండా తిట్టిపోస్తారు. నాని స్పీచ్ లను వైసీపీ వాళ్లు మాత్రమే ఎంజాయ్ చేస్తారు. మిగతా జనాలు మాత్రం నాని లాంటి నేతలను చూసి ఇదేం ప్రజాస్వామ్యమో అని ఈసడించుకుంటారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాని నియోజకవర్గం దాటి బయటకు రాలేదు. నియోజకవర్గంపై కూటమి నేతలు ఒకింత దృష్టి పెట్టడంతో ఓటమి తప్పదేమో అనుకుని అక్కడివరకే పరిమితమైపోయారు. ఇదే నా చివరి ఎన్నిక.. అందరూ ఓటేయండి అంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకున్నారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి నియోజకవర్గ ప్రజల్లో ఉత్కంఠ అయితే ఉంది. నాని గెలుస్తాడా? అంటే కచ్చితంగా గెలుస్తారని వైసీపీ వాళ్లు కూడా చెప్పలేకపోతున్నారు.
ఈసారి ఎన్నికల్లో కొడాలిని సొంత వైసీపీ పార్టీ శ్రేణులే వెన్నుపోటు పొడిచాయని మాట్లాడుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓ మైనార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఆయన ఓడిపోయేలా వైసీపీ కార్యకర్తలే పనిచేశారంటున్నారు. ఎన్నికలకు ముందు పంచాల్సిన డబ్బును ఎవరికి వారు మాయం చేసేశారని సదరు మైనార్టీ నాయకుడు తెలిపాడు. కొడాలి నాని దగ్గర నుంచి తీసుకున్న డబ్బుతో అమెరికా, మలేషియా వెళ్లి ఎంజాయ్ చేసిరావాలని నాయకులు భావిస్తున్నారట.
గుడివాడలో కొడాలిపై టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము పోటీ చేశారు. ఏడాది కాలం నుంచి ఈయన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. నానికి రాము గట్టి పోటీ ఇచ్చారని అంటున్నారు. అయితే నానికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ఆయన ఓడిపోవడం అంతా ఈజీ కాదని కూడా అంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వీస్తే మాత్రం నానికి పరాజయం తప్పదని చెపుతున్నారు. మొత్తానికి జూన్ 4 నాడు నాని మరోసారి విజయ ఢంకా మోగిస్తారా? లేదా రాము చేతిలో ఓడిపోతారా? అనేది తెలియనుంది.