BRS KCR : 13 ఏళ్లు ఉద్యమ పార్టీగా ప్రజల్లో, మరో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పురిటి గడ్డలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. రేపు లోక్ సభ ఫలితాలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తే మాత్రం పార్టీ మనుగడ సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని కేసీఆర్ కొట్టి పారేస్తున్నారు. రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలకే ఆదరణ ఎక్కువ ఉంటుందని, రాజకీయాల్లో ఇటువంటి ఆటుపోట్లు సహజమని చెబుతున్నారు. కానీ ఒకప్పటిలా పరిస్థితులు లేవనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోతున్నట్లు ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గనుక ఒక్క సీటు సాధించకుంటే మాత్రం గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితులే. ఇదిలా ఉండగా గులాబీ బాస్ మాత్రం మళ్లీ మహారాష్ర్ట పై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తున్నది. రాష్ర్టంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ మహారాష్ర్ట బాట పట్టడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.
మరో నాలుగు నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ పదవి కాలం ముగియనున్నది. ఈసారి ఎలాగైనా మహారాష్ర్టలో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. మహారాష్ట్రలోన తెలుగు వారున్న అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. పార్లమెంట్ ఎన్నిలకు ముందే వీటిని నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. ఇక జూన్ చివరి వారం నుంచి ఆగస్టు మొదటి వారంలోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే అధికార యంత్రాగం దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో గులాబీ బాస్ మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టడం పార్టీ నేతలు నివ్వెర పోతున్నారు.
బీఆర్ఎస్ సొంత రాష్ర్టంలో అధికారం కోల్పోవడంతో మహారాష్ట్రకు చెందిన లీడర్లు ఆ పార్టీని వీడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ సత్తా చాటాలనుకోవడం కేసీఆర్ ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. పురిటిగడ్డలో పార్టీ పట్టు కోల్పోకుండా చూసుకోవాల్సిన బీఆర్ఎస్ అధినతే మహారాష్ట్రపై దృష్టి పెట్టడం వెనుక ఏదో మతలబు ఉందన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
శివసేన – కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీతో చేతులు కలిపిన ఏక్ నాథ్ షిండే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీంతో బీజేపీకి లబ్ధి చేకూరాటంటే అక్కడ మరోపార్టీ పోటీ చేయడం తప్పనిసరి. ఈ క్రమంలో బీఆర్ఎస్ అక్కడ పోటీ చేసి వ్యతిరేకతను చీల్చబోతున్నదనే చర్చ జోరందుకుంది.