KTR : రేవంత్ ను కేటీఆర్ అంత మాట అనేశాడా? ట్వీట్ దుమారం

Did KTR say that to Revanth?

Did KTR say that to Revanth

KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చారు. మిగతా వాటి అమలు కోసం చర్యలు తీసుకుంటున్నారు.

అయితే కాంగ్రెస్ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, వంద రోజుల్లో అమలు చేయకుంటే ఆ పార్టీని వెంబడి పడుతామని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు హెచ్చరిస్తున్నారు. వీరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు కూడా బాగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇక సీఎం రేవంత్ ను కేటీఆర్ సహ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ‘గుంపు మేస్త్రీ’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా కేటీఆర్, హరీశ్ రావులను ‘బిల్లా, రంగా’ లుగా పోలుస్తూ రేవంత్ రెడ్డి సెటైర్స్ వేస్తున్నారు. మొన్నటి కాంగ్రెస్ సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.

కేసీఆర్ పై సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పులి అయితే .. ఆ పులిని బోనులో వేసి బొందపెడుతం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఇలా రేవంత్ వర్సెస్ కేటీఆర్, హరీశ్ అన్నట్టుగా ప్రతీ రోజూ మాటలు, ట్వీట్ల యుద్ధం జరుగుతోంది.

తాజాగా గణతంత్ర వేడుకలను రాష్ట్రమంతా సంబరంగా జరుపుకుంటున్న వేళ.. కేటీఆర్ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. దానికి ‘‘పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు..’’ అనే క్యాప్షన్ పెట్టారు. పోస్ట్ లో ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి..’’ అనే వేమన పద్యం పోస్ట్ చేశారు. అయితే కేటీఆర్ ఈ ట్వీట్ ను ఎవరిని ఉద్దేశించి చేశారో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై విపరీతంగా చర్చ జరుగుతోంది.

ప్రస్తుత సందర్భాన్ని బట్టి చూస్తే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసినట్టుగా కనపడుతోందని అర్థమవుతోంది. గత కొన్ని రోజులుగా రేవంత్ వర్సెస్ కేటీఆర్ మాటల యుద్ధంలో భాగంగానే కేటీఆర్ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. పేరు పెట్టకుండా పోస్ట్ చేసిన దాని అంతరార్థం అదే అని అనిపిస్తోంది. ఈ పోస్ట్ పై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కేటీఆర్ కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని అంటున్నారు.

TAGS