CM Revanth : గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి, కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణాల్లో ఒకటి ధరణి పోర్టల్. ధరణితో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, కబ్జాకోరులు లాభపడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ధరణితో తమ భూములు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, దాన్ని తీసివేయాలని లక్షల మంది డిమాండ్ చేశారు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల్లో తమను గెలిపిస్తే ధరణి తీసివేస్తామని రాహుల్ గాంధీ సహ అగ్రనేతలు హామీ ఇచ్చారు.
తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిని తీసివేయలేదు. కానీ ఎన్నికల ముంగిట సమస్యల పరిష్కారం చేయడానికి ఈనెల 1 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం ప్రయత్నించేలోపే ఎన్నికల కోడ్ రావడంతో ప్రస్తుతం ఆ ప్రక్రియను నిలిపివేశారు. మరో మూడు నెలల దాక ఆ సమస్యలు అలాగే ఉండిపోతాయి. దీని ప్రభావం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గేమ్ చేంజర్ గా మారిన ధరణి రద్దు హామీతో కాంగ్రెస్ ఎంతో కొంత లాభపడింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటినా ఆ సమస్య అలాగే ఉండిపోవడంతో ధరణితో ఇబ్బందులు పడుతున్న లక్షల మంది జనాలకు కాంగ్రెస్ పార్టీపై కూడా నమ్మకం సడలిపోతోంది. ధరణిపై వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వ అలసత్వం వల్లే ఇలా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. కాగా, ధరణి సమస్యల పెండింగ్ తో లోక్ సభ ఎన్నికల్లో బాధితులంతా ఎలా స్పందిస్తారో చూడాలి.