Dharani Portal : గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఎన్నో వివాదాలకు కారణమైంది. దీంతో ధరణి పోర్టల్ పై ప్రజలు కూడా ఒక దశలో అసహనం వ్యక్తం చేశారు. అన్ని సవ్యంగా వచ్చిన వారికి ఏం లేదు. కానీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా భూములు రికార్డుల్లోకి ఎక్కని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
2017లో ధరణి పోర్టల్ వచ్చినప్పుడు భూస్వాముల భూములను నమోదు చేయించుకున్నారు. అంతవరకు నగరాలకు వలస వెళ్లిన దొరలు తమ భూములను గుట్టు చప్పుడు కాకుండా ధరణిలో నమోదు చేయించుకుని రైతుబంధు నిధులు కొట్టేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాగు చేయని భూములకు కూడా రైతుబంధు నిధులు ఇవ్వడంతో చాలా మంది లాభపడ్డారు.
పల్లెటూల్లో చాలా మంది భూములు ధరణిలో ఎక్కలేదు. దీంతో వారికి మొండిచేయే చూపుతున్నారు. వారు కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా కావడం లేదు. దీంతో ధరణి పోర్టల్ ఉన్న వాడికే తప్ప లేని వాడికి ఎలాంటి లాభం చేకూర్చడం లేదు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో చేస్తామని చెబుతున్నా అది ఇంకా కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.
భూ ప్రక్షాళన పేరుతో రెవెన్యూ అధికారులు భూములను బినామీలు, బంధువుల పేరిట నమోదు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా నగునూరులో 26 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇలాగే చేశారు. కరీంనగర్ – గోదావరిఖని హైవేకు కిలోమీటరున్నర దూరంలో ఉన్న తారు రోడ్డుకు ఇరువైపుల భూమి ఉండడంతో 22 ఎకరాలను 18 మంది పేరిట నమోదు చేయడం సంచలనం కలిగించింది.
ఇలా ఇష్టారాజ్యంగా భూములను పట్టా చేయించుకుని అర్హులకు మొండిచేయి చూపిన దాఖలాలున్నాయి. ఈనేపథ్యంలో ధరణిని ప్రక్షాళన చేస్తే ఇంకా చాలా భూములు వెలుగులోకి వచ్చే అవకాశముంది. అధికారులు ఈ దిశగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.