Tirumala : తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు..అన్ని కంపార్ట్ మెంట్లు ఫుల్
Tirumala : ఎండాకాలం వచ్చిందంటే చాలు తిరుమల కొండ కిటకిటలాడాల్సిందే. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో ఈ సమయంలో తిరుమలకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిని దర్శించుకునే వారు పెరిగిపోతున్నారు. తిరుమలలో స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లన్నీ నిండి వెలుపల కూడా భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి.
ఇక తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్టుగా టీటీడీ వెల్లడించింది. ఇదిలా ఉంటే బుధవారం రోజు 81,930 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 41,224 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో 3.90 కోట్ల కానుకలు వచ్చాయి. మొన్న సర్వదర్శనానికి భక్తులకు 18 గంటల సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే తాజాగా నిన్న 76,369 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 41,927 మంది తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ పేర్కొంది. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు వచ్చింది. ప్రస్తుతం భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 9 గంటల నుంచి పది గంటల సమయం పడుతుంది. అయితే వేసవి ఆరంభంలో విపరీతంగా ఎండలు ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కానీ ఇప్పుడు అడపాదడపా వర్షాలు పడి వాతావరణం చల్లబడడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక తిరుమలకు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఇక తిరుమలలో భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు.