Kondagattu : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో జరుగుతున్న హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన లక్ష్మణ్ (55) కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టుకు వచ్చారు. ఉచిత బస్సు ఎక్కబోతుండగా కిందపడిన లక్ష్మణ్ కాళ్లపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆయన కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే లక్ష్మణ్ ను 108లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దైవ దర్శనానికి వచ్చి బస్సు ఎక్కబోతూ కిందపడి లక్ష్మణ్ మృతి చెందడం విషాదం.
ఈరోజు హనుమాన్ జయంతి కావడంతో ఆంజనేయస్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే క్యూ లైన్లలో బారులుతీరి అంజన్నను దర్శనం చేసుకుంటున్నారు. అంజన్న దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. కొండగట్టు స్టేజీ నుంచి దొంగలమర్రి, జేఎన్టీయూ మీదుగా కొండపైకి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.