Lebanon : బీరుట్‌లోని ఐక్య రాజ్య సమితి (ఐరాస) శాంతి పరిరక్షణ దళాలు ఉన్న చోట ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుండడంతో అక్కడి పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో మన సైనికులు పని చేస్తున్నారు. ఈ సమయంలో భారత్ స్పందించింది. ఈ వివాదం ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూడడం చాలా ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజా ఉద్రిక్తతల సమయంలో ఇజ్రాయెల్, ఇరాన్‌తో పాటు ఇతర పశ్చిమాసియా దేశాల్లో భారతీయులను తరలించే ప్రక్రియను చేపట్టడం లేదని భారత విదేశాంగశాఖ తెలిపింది.
దక్షిణ లెబనాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ కార్యాలయంపై దాడులు జరగడం ఆందోళనకరం అని భారత విదేశాంగశాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది ‘లెబనాన్ సరిహద్దులో పరిస్థితులు క్షీణించడంపై ఆందోళన వ్యక్తి చేసింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఐరాస ప్రాంగణాలను గౌరవించాలి. ఆ సంస్థ నిర్ణయాలను గౌరవించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘పశ్చిమాసియాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ప్రకటన విడుదల చేశాం. అక్కడ హింస ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. సంబంధిత భాగస్వామ్యపక్షాలు సంయమనం పాటించాలి. పౌరులకు రక్షణ కల్పించాలని పునరుద్ఘాటించాం. ఈ ఘర్షణ విస్తరించకూడదు. దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ సూచించారు.
యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ సౌత్ లెబనాన్ శాంతి పరిరక్షణ దళాల్లో భారత సైన్యం కూడా విధులు నిర్వర్తిస్తోంది. 50 దేశాల నుంచి 10,500 మందితో కూడిన దళాలు యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌లో ఉన్నాయి. ఇందులో భారత్‌కు చెందిన 900 మందితో కూడిన బెటాలియన్ విధుల్లో ఉంది.