Kavitha : ఢిల్లీ మద్యం స్కాంలో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పై ఎమ్మెల్సీ కవిత తిరుగుబావుటా ఎగురేసిన విషయం తెలిసిందే. విచారణకు తాను హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు ఈ మెయిల్ పంపిన విషయం అందరినీ షాక్ కు గురిచేసింది. మొన్నటిదాక అరెస్ట్ ను తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేసిన కవిత ఉన్న పళంగా రూట్ మార్చారేంటని అందరికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తెగింపునకు కారణాలెంటో ఒకసారి పరిశీలిద్దాం..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో తాను హాజరుకాలేనంటూ ఈడీకి కవిత ఈమెయిల్ పంపారు. ఇందులో ఈడీ విచారణకు గైర్హాజరు కావడానికి గల కారణాలను అందులో వివరించారు. సుప్రీం కోర్టులో తనపై ఈడీ విచారణ కేసు పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు.
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సైతం ఈడీపై ఇలానే తిరుగుబాటు చేశారు. ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ నోటీసులు జారీ చేసినా.. కేజ్రీవాల్ కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీకి ఎప్పటికప్పుడు తన వాదనతో లేఖలు రాస్తునే ఉన్నారు. తనను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండని సవాల్ విసురుతున్నారు.
ఇప్పుడు కవిత కూడా అదే దారిని ఎంచుకున్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును సాకుగా చూపుతున్నారు. అయితే ఆమె సుప్రీంలో కేసు వేసింది రాత్రిపూట మహిళలను విచారించవద్దు అని. అంతే తప్ప విచారణకు డుమ్మా కొట్టేందుకు కాదని.. కవిత చర్యలతో అరెస్ట్ తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే అరెస్ట్ ఖాయమని కవిత కూడా తెలుసని, అందుకే దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం తనను రాజకీయంగా ఎదుర్కొలేకనే కుట్ర చేసి అరెస్ట్ చేసిందని నిరసన కార్యక్రమాలకు దిగవచ్చు. అలాగే మహిళా నేతను అరెస్ట్ చేశారని ఎన్నికల వేళ సానుభూతి ఓట్లను పొందవచ్చు. ఇలా తన అరెస్ట్ తో పార్టీని ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి తెప్పించి.. బీజేపీని కుట్రదారుగా చేస్తూ ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
కవిత అరెస్ట్ ను గతంలో కేసీఆర్ కేంద్రంతో మాట్లాడి ఆపుచేయించారని ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇవే తెలంగాణలో బీజేపీ కొంప ముంచాయి. ఇప్పుడు తాజాగా బీజేపీ కవిత అరెస్ట్ రంగం సిద్ధం చేయించే అవకాశాలే ఉన్నాయి. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా కవిత అరెస్ట్ పై ఎలాంటి సాయం చేయదు. ఇవన్నీ తెలిసే అరెస్ట్ అయిన కూడా సింపతీ పొందాలని, బీఆర్ఎస్ భవిష్యత్ రాజకీయాల్లో ప్రధాన నేతగా ఎదగాలని చూస్తున్నారని, అందుకే అంత తెగింపుగా, దూకుడుగా ముందుకెళ్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.