JAISW News Telugu

IAS Krishna Teja : డిప్యూటీ సీఎం పవన్‌ ఓఎస్‌డీగా యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్‌ ఆఫీసర్

Deputy CM Pawan OSD

Deputy CM Pawan OSD IAS Krishna Teja

IAS Krishna Teja :  ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు పవన్ కళ్యాణ్. గెలిచిన మొదటి సారే ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన పేషీలో యంగ్ ఐఏఎస్ రానున్నట్లు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా కేరళలో పనిచేస్తున్న ఏపీకి చెందిన యంగ్ ఐఏఎస్‌ అధికారి మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ రానున్నారు. సాధారణంగా ఆర్డీవో స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్‌డీలుగా నియమిస్తారు. అయితే పవన్‌కల్యాణ్‌ కోసం.. ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి సీఎం చంద్రబాబు స్పెషల్ పర్మీషన్ ఇచ్చారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా కృష్ణ తేజ పనిచేస్తున్నారు. ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ రెండు రోజుల కిందట సచివాలయంలో పవన్‌కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆయనను పురస్కారానికి సెలక్ట్ చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్‌ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా చేశారు. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన.. 2023 మార్చిలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా పేరెంట్స్ ను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి.. దాతల సహకారంతో ఉన్నత చదువులకు ఆయన చేయూత అందించారు. అలాగే కరోనా మహమ్మారి కారణంగా  భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతో పాటు 150మందికి ఉపాధి అవకాశాలను కల్పించారు. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు.

Exit mobile version