Deputy CM Pawan Kalyan : వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు నోటిసులివ్వాలని డిప్యూటీ సీఎం ఆదేశం
Deputy CM Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనదైన రీతిలో పాలనలో దూసుకెళ్తున్నారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతీ క్షణం ప్రజా సేవలో తీరిక లేకుండా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. తక్షణమే వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడకు చెందిన వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్.
అధికారులతో సమీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం..కాకినాడ జిల్లా గురజనాపల్లిలో ఉన్న వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయాన్ని చర్చించారు. ఈ సంస్థ రోజుకు 25 టన్నుల ఉత్పత్తికి అనుమతులు పొంది 56 టన్నులు ఉత్పత్తి చేస్తున్నట్లు గుర్తించామని ఈసందర్భంగా అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సంస్థ నుంచి వచ్చే వ్యర్థజలాలు, ఆక్వా వ్యర్థాల నిర్వహణకు అక్కడి ఎఫ్లుయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్స్ సామర్థ్యం సరిపోదని.. అక్కడి వ్యర్థాలను బైపాస్ చేస్తున్నారని అధికారులు తెలిపారు.
ఈ వ్యర్థాలను స్థానికంగా పారవేయడం వల్ల కాలుష్యం పెరుగడం, గ్రామాల్లో వివాదాలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. దీనికి డిప్యూటీ సీఎం స్పందిస్తూ..ఈ సంస్థ వ్యర్థ జలాలను పంట కాల్వల్లోకి విడిచిపెడుతున్న విషయాన్ని ఆ ప్రాంత రైతులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారన్నారు. సదరు సంస్థకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేసి 15 రోజుల్లోగా వివరణ తీసుకోండని అధికారులను ఆదేశించారు. అలాగే అక్కడ నిబంధనల ఉల్లంఘనలపై లోతుగా విచారణ చేపట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్.