JAISW News Telugu

DC Vs MI : ఢిల్లీ దెబ్బకు.. ముంబయి ఇండియన్స్ చిత్తు

DC Vs MI

DC Vs MI

DC Vs MI : ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హర్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. ఆ నిర్ణయం తప్పని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఢిల్లీ బ్యాటర్ జేమ్స్ ఫ్రేజర్ ముగుర్క్ మొదటి బంతి నుంచే ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 84 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 11 ఫోర్లు 6 సిక్సర్లతో చెలరేగి ముంబయి బౌలర్లను చీల్చి చెండాడాడు.

జేమ్స్ ఔటైన తర్వాత వచ్చిన షై హోప్ కూడా 17 బంతుల్లోనే 5 సిక్సులు కొట్టి 41 పరుగులు చేశాడు. ట్రిస్టన్ స్టబ్స్, పంత్, అభిషేక్ పొరేల్ తలో చేయి వేయడంతో ఢిల్లీ తమ మొదటి ఇన్సింగ్స్ లో 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబయి బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ఒక్కడే తక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లలో కేవలం 35 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. మిగతా బౌలర్లందరూ తేలిపోయారు.

258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. సూర్య కూడా 26 పరుగులకే వెనుదిరిగాడు. 65 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో తిలక్ వర్మ డేరింగ్ ఇన్సింగ్స్ ఆడాడు. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులతో 32 బంతుల్లోనే 63 పరుగులు చేసి చివరి ఓవర్ లో రనౌట్ అయ్యాడు. హర్దిక్ పాండ్యా 24 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో 46 పరుగులు చేసి రసిల్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

ముంబయి విజయానికి చివరి ఓవర్లో 24 పరుగుల చేయాల్సిన దశలో తిలక్ వర్మ చివరి ఓవర్ మొదటి బంతికి రెండో పరుగుకు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో ముంబయి 10 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఈ గెలుపుతో ఢిల్లీ 5 విజయాలతో పాయింట్స్ టేబుల్స్ లో చెన్నైను వెనక్కి నెట్టి అయిదో స్థానానికి చేరుకుంది. ముంబయికి ఆరో ఓటమి కాగా తొమ్మిదో స్థానానికి పరిమితమైంది.

Exit mobile version