Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీసుకోకుండా తప్పించుకుంటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం (ఫిబ్రవరి 05) సుప్రీంకోర్టుకు నివేదించింది.
‘కవిత సమన్లకు దూరంగా ఉంటున్నారు. ఆమె హాజరుకావడం లేదు’ అని ఈడీ తరఫు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనానికి విన్నవించారు.
దీనిపై కవిత తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ సమన్లను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను 2023, నవంబర్ 20న తదుపరి విచారణ జరిగే వరకు ఈడీ ఎదుట హాజరుకావాలని పిటిషనర్‌కు ఎలాంటి నోటీసులు జారీ చేయబోమని ఏఎస్ జీ రాజు గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని తెలిపారు.
‘మరుసటి తేదీ వరకు చెప్పాను. నా ప్రకటనకు ఎల్లవేళలా రక్షణ లభించదు’ అని ఏఎస్జీ రాజు బదులిచ్చారు. మెరిట్ పై ఏమీ చెప్పకుండా విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 16వ తేదీ ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.
ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా జరుగుతున్న దర్యాప్తులో తదుపరి లిస్టింగ్ తేదీ వరకు హాజరవ్వాలని సుప్రీంకోర్టు కవితను ఆదేశించింది. తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో గతేడాది మార్చి 11, 20, 21 తేదీల్లో ఈడీ ఆమెను ప్రశ్నించింది.