JAISW News Telugu

Degree colleges : నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్.. యాజమాన్యాల పిలుపుతో ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్..

Degree colleges : గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కలిసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విద్యార్థి సంఘాలు, కాలేజీ, స్కూల్స్ యాజమాన్యం అంటోంది. ఏండ్లకు ఏండ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో ప్రైవేట్ విద్యార్థులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు బకాయి పడింది. తమపై భారం రోజు రోజుకు పెరుగుతుందని మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు కాలేజీలకు రానివ్వడం లేదని, పరీక్షలకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు సైతం పెడుతున్న గోడును ప్రభుత్వం మచ్చుకైనా పట్టించుకోవడం లేదు.

రేవంత్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పూర్తి స్థాయి విద్యా శాఖ మంత్రి లేడు. దీనికి తోడు కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా బాకీ పడింది. కాలేజీలు, ప్రయోగశాలల్లో వస్తువుల కొనుగోలుకు తమ వద్ద రూపాయి లేదంటూ ప్రైవేట్ కాలేజీలు గగ్గోలు పెడుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవడం తప్పని చెప్తున్నా.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.

అయితే, ప్రభుత్వ విధానంను నిరసనిస్తూ ప్రైవేట్ కాలేజీలు భారీ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల నిరవధిక బంద్ కు యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. రూ. 2వేల కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు కాలేజీలను మూసి వేస్తున్నట్లు ప్రకటించాయి. సెమిస్టర్ పరీక్షలను సైతం బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యం ప్రకటించింది. బంద్ లో కాలేజీలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.

అయితే, మధ్యాహ్నం ప్రభుత్వంతో డిగ్రీ కాలేజీల యాజమాన్యం చర్చలు జరిపాయి. ఈ చర్చలు సఫలీ కృతం అయినట్లు తెలుస్తోంది. డిగ్రీ 3, 5 పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

Exit mobile version