Virat Deep Fake : రష్మిక మందన ఘటన తర్వాత డీప్ ఫేక్ దేశంలో హాట్ టాపిక్ గా మారింది. వ్యక్తుల పరువుకు భంగం కలిగిస్తున్న డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల కట్టడి కేంద్రం ఓ వైపు చర్యలు తీసుకుంటున్న నకిలీల బెడదలు తప్పడంలేదు. తాజాగా టీమిండియా సార్ట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డాడు. డీప్ ఫేక్ చేయబడిన సదరు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ బెట్టింగ్ యాప్ ను అతడు ప్రచారం చేస్తున్నట్లు ఉండడం గమనార్హం.
ప్రముఖ టీవీ చానల్ లైవ్ న్యూస్ కార్యక్రమంలో కోహ్లీ యాడ్ ను ప్రసారం చేసినట్లు సైబర్ కేటుగాళ్లు ఈ వీడియోను సృష్టించారు. గతంలో కోహ్లీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ కు సంబంధించిన వీడియో క్లిప్ ను మార్ఫింగ్ చేసి.. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లు రూపొందించారు. తక్కువ పెట్టుబడితో సులువుగా ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించవచ్చో క్రికెటర్ చెబుతున్నట్లుగా అందులో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అది నకిలీదని పలువురు కామెంట్ చేస్తున్నారు. దీనిపై కోహ్లీ ఇంకా స్పందించలేదు.
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల సచిన్ టెండూల్కర్ సైతం గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నట్లు నకిలీ వీడియో వైరల్ అవగా, దాన్ని ఆయన ఖండించారు. వీడియోలో ఉన్నది తాను కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ‘‘టెక్నాలజీని ఇలా విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వీడియోలు, ప్రకటనలు, యాప్ లు ఎక్కడ కనిపించినా వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయండి’’ అంటూ సచిన్ పోస్ట్ చేశారు. అంతకుముందు సచిన్ తనయ సారా టెండూల్కర్ కూడా డీప్ ఫేక్ బారిన పడడం గమనార్హం.