CM Revanth Reddy : మానవీయ కోణంలో నిర్ణయాలుండాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా సంతృప్తి ఉండదు. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే సరైన సేవలు అందించవచ్చు. తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు లబ్ధి చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలి. ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలా పనిచేయాలి’’ అని సీఎం రేవంత్ అన్నారు.
ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. 9 కీలక అంశాలతో ప్రభుత్వం ఎజెండా రూపొందించింది. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం-కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం-సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, ఇతర భద్రతాపరమైన అంశాలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం తదితర అంశాలు అందులో ఉన్నాయి.