JAISW News Telugu

Hizbullah : హిజ్బుల్లా ‘మిలిటరీ’కి చావుదెబ్బ – మిగిలిన వారిని మట్టుబెట్టే ప్లాన్ !

Hizbullah

Hizbullah Military

Hizbullah  Military : ఇజ్రాయెల్ వరుస దాడుల ద్వారా లెబనాన్‌లోని హెజ్ బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతోంది. కీలక కమాండర్లను హతమారుస్తూ, హిజ్బుల్లా మిలటరీని చావుదెబ్బ తీస్తోంది. శుక్రవారం బీరుట్‌లో జరిగిన క్షిపణి దాడిలో కనీసం 16 మంది కమాండర్లు మరణించారు. వీరిలో హిజ్బుల్లా నెం.2 నాయకుడు ఇబ్రహీం అకీల్..  కమాండర్ అహ్మద్ మహ్మద్ వహ్బీ కూడా ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది. అకీల్‌తో సహా కీలక ఉగ్రవాదులను హతమార్చడం వల్ల హిజ్బుల్లా అత్యున్నత సైనిక స్థాపన దాదాపుగా ఛిద్రమైందని పేర్కొంది.

వీరి తర్వాత హిజ్బుల్లా చీఫ్‌ నస్రుల్లా  కీలక కమాండర్‌ను మట్టుబెట్టాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది. ఇప్పటికే దాదాపు ఆరుగురు కమాండర్లను తుదిముట్టించిన ఇజ్రాయెల్ సేన  తాజాగా అలీ కరాకీ అనే కమాండర్‌ కోసం వేట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అతడిని టార్గెట్ గా చేసుకొని వైమానిక దాడిని నిర్వహించాయి. కానీ, అతడు సురక్షితంగానే సీక్రెట్ ప్లేసులో దాక్కుని ఉన్నట్లు హిజ్బుల్లా ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్‌ దళాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. తాము చేసిన దాడి ఫలితాలను తర్వాత వెల్లడిస్తామని తెలిపాయి.

ప్రస్తుతం అలీ కరాకీ హిజ్బుల్లా దక్షిణ కమాండ్‌కు చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సౌత్‌ లెబనాన్‌లో హిజ్బుల్లా కార్యకలాపాలు మొత్తం అతడి కనుసన్నల్లోనే నడుస్తాయి. జిహాద్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా కూడా పని చేస్తున్నాడు. అతడి కింద నాసర్‌ రీజనల్‌ డివిజన్‌, అజిజ్‌ రీజనల్‌ డివిజన్‌, బదెర్‌ రీజనల్‌ డివిజన్లు ఉన్నాయి.  అలీ కరాకీని ఇటీవల మరణించిన హిజ్బుల్లా నెంబర్‌-2 నాయకుడు, రద్వాల్‌ ఫోర్స్‌ అధినేత ఇబ్రహీం అకిల్‌ స్థానంలో నియమించినట్లు సౌదీ అరేబియాకు చెందిన అల్‌ హదాత్‌ తన కథనంలో పేర్కొంది.  అతడితో పాటు మరో సీనియర్‌ కమాండర్‌ తలాల్‌ హమియాకు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొంది.  ఇటీవల సైన్యంలో కీలక విభాగంగా ఉన్న రద్వాల్‌ యూనిట్‌పై దాడి జరిగింది. దీనికి ఆపరేషన్స్‌ కమాండర్‌ ఇబ్రహీం అకిల్‌ నేతృత్వం వహించారు.  యూనిట్‌ సభ్యులతో సమావేశమైన సమయంలోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. హిజ్బుల్లా అత్యున్నత సైనిక విభాగమైన జిహాద్‌ కౌన్సిల్‌లోనూ గతంలో పనిచేసిన ఆయన.. 1980ల్లో ఈ సంస్థ జరిపిన అనేక దారుణమైన దాడుల్లో ముఖ్య భూమిక పోషించారు.

హిజ్బుల్లా దళాలు సాధారణ పౌరుల ఇళ్లల్లో భారీగా క్రూజ్‌, ఇతర క్షిపణుల ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. పైకి సాధారణ భవనంలాగే ఉన్నా.. దాని తొలి అంతస్తులో క్షిపణులు ఉన్నట్లు పేర్కొంది. వీటిపై శక్తిమంతమైన వార్‌హెడ్స్‌ను అమర్చినట్లు తెలిపింది. గత ఇరవై ఏళ్ల నుంచి హిజ్బుల్లా వీటిని ప్రజల ఇళ్లల్లో అమరుస్తుందన్నారు.  సోమవారం సాయంత్రానికి ఇజ్రాయెల్‌ మొత్తం 1600 టార్గెట్లపై దాడులు చేసింది.

Exit mobile version