India vs England : డే వన్ అదరగొట్టిన ఇండియా.. తొలిరోజే ఇంగ్లాండ్ కు చుక్కలు
India vs England : హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 119/1 రన్స్ చేసింది. ఓపెనర్ జైస్వాల్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డే తరహాలో ఆడి 3 సిక్సర్లు, 9 ఫోర్లతో 76 స్కోర్ తో నాటౌట్ గా నిలిచాడు. అతడితో పాటు గిల్ 14 పరుగులతో ఉన్నాడు. అయితే ఓపెనర్ గా వచ్చిన రోహిత్ 24 పరుగులు చేసి ఔటయ్యారు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ను భారత బౌలర్లు 246 పరుగులకే అలౌట్ చేశారు. కాగా, ఇండియా 127 పరుగుల వెనకబడి ఉంది.
దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. జాక్ లీచ్ బౌలింగ్ లో 12.2 ఓవర్ల వద్ద భారీ షాట్ కు యత్నించి కెప్టెన్ రోహిత్ శర్మ 24(27) ఔటయ్యాడు. ఇక జైస్వాల్ మాత్రం అద్దరగొట్టాడనే చెప్పాలి. 47 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
అంతకుముందు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 246 పరుగులకు అలౌట్ అయ్యింది. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డెకెట్ క్రీజులోకి వచ్చారు. తొలి ఓవర్ ను బుమ్రా ప్రారంభించారు. ఓపెనర్లు దూకుడుగా ఆడి 11 ఓవర్లకు 53 పరుగులు సాధించారు. ఇక ఆతర్వాత అశ్విన్ బౌలింగ్ లో తొలి వికెట్ పడింది. 11.5 ఓవర్ లో డకెట్ (35) ఎల్బీ అయ్యాడు. 14వ ఓవర్ లో జడేజా బౌలింగ్ లో ఓలీ పోప్(1) స్లిప్ లో రోహిత్ కు దొరికాడు. ఇక ఆ తర్వాతే బౌలింగ్ కు వచ్చిన అశ్విన్ 16వ ఓవర్ లో తొలి బంతికే ఓపెనర్ క్రాలే(20)ను ఔట్ చేశాడు. మిడాఫ్ లో సిరాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో 60 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 3వ వికెట్ నష్టపోయింది. క్రాలే స్థానంలో వచ్చిన బెయిర్ స్టో , జో రూట్ కలిసి ఇన్నింగ్స్ ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. లంచ్ బ్రేక్ వరకూ క్రీజులో పాతుకుపోయారు.
అయితే ఆతర్వాత 32 ఓవర్ లో అక్షర్ పటేల్ వేసిన బంతికి బెయిర్ స్టో(37) ఔటయ్యాడు. ఫుల్ లెన్త్ డెలివరీ ఆఫ్ స్టంప్ ను గిరాటేసింది. దీంతో 121 పరుగుల వద్ద ఇంగ్లాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జో రూట్ (29)ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. 35వ ఓవర్ లో జడ్డూ వేసిన బంతిని స్వీప్ షాట్ ఆడబోయాడు. షార్ట్ ఫైన్ లెగ్ లో బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో క్రీజులో పాతుకుపోయిన ఇద్దరు బ్యాటర్ పెవిలియన్ చేరుకోవడం గమనార్హం. అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఫోక్స్ ఔటయ్యాడు. ఇక తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. 246 పరుగులకు అలౌట్ అయ్యారు.
భారత బౌలర్లలో అశ్విన్ 3, జడేజా 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 70 పరుగులు చేశారు. 88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో అర్ధ శతకం చేశారు.