YSR-Ebrahim Raisi నేతల ప్రాణాలకు డేంజర్‘బెల్’.. అప్పుడు వైఎస్సార్ ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్
YSR-Ebrahim Raisi : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇక లేరు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో రైసీ, ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్హియాన్ మరణించారు. ఈ ఘటనను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఆదివారం హెలికాప్టర్ కూలిపోయింది. అనేక ఇతర ఇరాన్ అధికారులు కూడా విమానంలో ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన రాసుకొచ్చారు. భారత్, ఇరాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఆయన కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖ సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోందన్నారు.
అమెరికాలో తయారు చేసిన బెల్ 212 హెలిక్యాప్టర్ పెను ప్రమాదానికి గురైంది. ఇరాన్- అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. రైసీ.. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత హెలిక్యాప్టర్ లో రాజధాని టెహ్రాన్‌కు తిరుగు పయనం అయ్యారు. ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్‌లోని వర్జాఖాన్- జోల్ఫా మధ్య అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తోన్న సమయంలో అది కుప్పకూలింది. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీదీ తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా పైలెట్.. హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణం, పొగమంచు కారణంగా సహాయక, భద్రత సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోయారు. దీంతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం నెలకొంది.
ప్రమాద ప్రాంతానికి చేసుకోవడానికి సహాయక సిబ్బందికి సుమారు 20 గంటల సమయం పట్టింది. టర్కీకి చెందిన డ్రోన్లు హెలిక్యాప్టర్ శకలాలను గుర్తించాయి. దాని జాడ తెలిసిన తరువాత సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. హెలిక్యాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. మృతుల శరీర భాగాలను గుర్తించడం కూడా కష్టమైంది. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలతో జీవించి లేరని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. మొత్తం తొమ్మిదిమంది మృతిచెందినట్లు నిర్ధారించింది. ఇబ్రహీ రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ హొస్సైన్ అమిరబ్దుల్లాహియాన్, అయతొల్లా సయ్యద్ ముహమ్మద్ అలీ అల్-హషెమ్, డాక్టర్ మాలిక్ రహ్మతి, సర్దార్ సయ్యద్ మెహదీ మౌసవి, అన్ అనసర్ అల్-మెహదీ కార్ప్స్, పైలెట్, కో పైలెట్, కృఛేవ్ అనే వ్యక్తి మరణించారు. రైసీ హెలికాప్టర్ దుర్ఘటన ఉదంతం.. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదాన్ని గుర్తు చేసింది. వైఎస్సార్ సైతం బెల్ రకానికి చెందిన హెలికాప్టర్ ప్రమాదంలోనే మరణించారు. దీంతో ఈ రెండు ఘటనలను పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు.