Danam Nagendher : తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై దానం నాగేందర్ ను బరిలోకి దింపాలని యోచిస్తోంది. దీనికి దానం కూడా ఒప్పుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆయన కాంగ్రెస్ ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరినీ కలిశారు. రేపో, మాపో కాంగ్రెస్ కండువా కప్పుకుని సికింద్రాబాద్ ఎంపీగా పోటీకి దిగే సూచనలు కనపడుతున్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలు పెరుగుతున్నాయి. విశాఖ పట్నం బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే తొలకంటి ప్రకాశ్ గౌడ్, మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వీరంతా రెండు రోజుల్లో పార్టీలో చేరబోతున్నారు. మరికొంత మంది కీలక నేతలు కూడా చేరే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఢిల్లీలో ఆయనకు ఓ పదవి ఇచ్చారు. పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సోమవారం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగనుంది. మూడో జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వీరిలో అత్యధికం కొత్తగా పార్టీలో చేరిన వారికే సీట్లు ప్రకటించనున్నారు.