Damachrala Sathya : ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా టీడీపీ నేత దామచర్ల సత్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. కష్టనష్టాల్లో వెన్నంటే ఉంటూ తను ఈ స్థాయికి వచ్చేందుకు సహకరించిన కొండెపి ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి పలువురు పార్టీ నేతలు సత్యకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ రామాయపట్నం, బందరు పోర్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామన్నారు. బోర్డు ద్వారా రూ.20 వేల కోట్లు విలువైన అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లే ఎన్నో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. మత్స్యకారులకు మేలు జరిగేలా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి బోర్డు ద్వారా కృషి చేస్తామని తెలిపారు.