Cyclone Dana : దానా తుపానుకి ఆ పేరు ఎలా వచ్చింది..  తుపాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా ?

Cyclone Dana

Cyclone Dana

Cyclone Dana:  ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోంది. దక్షిణ కోస్తా వెంబడి విశాఖకు ఆగ్నేయంగా కదులుతున్న వాయుగుండం వల్ల రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సముద్ర అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీరప్రాంతాల్లోని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, వెంటనే తమ పడవలను ఒడ్డుకు చేర్చాలని ప్రభుత్వం సూచిస్తోంది.  తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. తీరప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తామని, ఇప్పటికే మెరైన్, ఫిషరీస్ శాఖల ద్వారా మత్స్యకారులకు సమాచారం అందజేశామన్నారు. ఈ నేపథ్యంలో తుఫానులకు ప్రత్యేక పేర్లు ఎలా పెడతారు? వాటిని ఎవరు ఆమోదిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. తుఫానులకు పేర్లు పెట్టడం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నామకరణ విధానం కొద్దిగా మారుతూ ఉంటుంది. కనీసం గంటకు 61 కి.మీ వేగంతో గాలులు వీచినప్పుడు మాత్రమే తుఫానుకు పేరు పెట్టడం ఆనవాయితీ.

దానా తుపాను అని ఎలా పేరు పెట్టారంటే..  
దానా అంటే అరబిక్‌లో  ‘అందమైన ముత్యం’, అత్యంత సంపూర్ణ పరిమాణం, ఎంతో విలువైనది వంటి అర్థాలు వస్తాయి. ఈ పదానికి సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ఈ పేరు పర్షియన్ గల్ఫ్‌లోని అరబ్ దేశాలలో ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ వేర్వేరు రకాల ముత్యాలకు ప్రత్యేకమైన పేర్లు పెడుతుంటారు. ‘దానా’ పేరు అత్యుత్తమమైన ముత్యాన్ని సూచిస్తుంది. ఇక పర్షియన్‌ భాషలో దానా అంటే ‘వివేకం’ అనే అర్థం కూడా వస్తుంది. ఖతార్ ‘దానా’ అనే పేరును సూచించింది. అంతర్జాతీయ తుఫాను నామకరణ వ్యవస్థలో భాగంగా ఈ పేరు ప్రతిపాదించబడింది. తుఫానులను సులభంగా గుర్తించడానికి, వాటి కదలికలను అంచనా వేయడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి, అవగాహన కల్పించడానికి ఈ విధంగా పేరు పెట్టారు.

తుఫానులకు పేరు పెట్టే పద్ధతి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రమాణంగా మారింది. దేశాల మధ్య సమాచారాన్ని పంచుకోవడానికి.. తుఫానుల కదలికలను గుర్తించడానికి ఈ వ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏప్రిల్ 2020 నాటికి ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులకు పేరు పెట్టడానికి 13 దేశాలు ఒక సమూహాన్ని ఏర్పాటు చేశాయి. ఈ దేశాల జాబితాలో భారతదేశం, బంగ్లాదేశ్, ఖతార్, ఇతర దేశాలు ఉన్నాయి. తుఫానులకు పేరు పెట్టే ప్రక్రియను ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) పర్యవేక్షిస్తుంది. తుఫానులకు ఇవ్వబడిన పేర్లు సాంస్కృతికంగా సముచితమైనవి, సులభంగా ఉచ్చరించబడతాయి. ప్రతి పేరు ఆమోదించబడటానికి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

TAGS