Cybercrime ambassador : సైబర్ క్రైమ్ (14c)అంబాసిడర్ గా బాధితురాలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Cybercrime ambassador : ప్రస్తుతం సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్నది. ఏఐ అభివృద్ధి చెందుతుండడంతో ఓ వ్యక్తి తనను తానే నమ్మలేక పోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక వ్యక్తి ఫొటోలు, వీడియోలే కాదు వాయిస్ కూడా అచ్చంగా దించేస్తున్నారు. సైబర్ ఉన్మాదుల కారణంగా పెరిగిన సాంకేతిక నైపుణ్యానికి సంతోషించాలో, ఊబిలో కూరుకుపోతున్నామని బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే సోషల్ మీడియాతో లాభాలతో పాటు నష్టాలు కూడా వెంటాడుతున్నాయి. ఈ విషయంలో సినీ సెలబ్రెటీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
కొంత కాలంగా డీప్ ఫేక్ వీడియోలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇందులో భారతదేశంలో తొలి బాధితురాలు నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్న అనే విషయం అందరికీ తెలిసిందే. ఓ రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. రష్మిక మందన్న ఫేస్ ను మరో అమ్మాయి వీడియోకు ఎడిట్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కొందరు సైబర్ ఉన్మాదులు. ఓ బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్ ను జత చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. దీని పై చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసే ఉన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితురాలే బ్రాండ్ అంబాసిడర్
తాజాగా కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నేషనల్ క్రష్, హీరోయిన్ రష్మిక మందన్నను నియమించింది. అలాగే ఆమెతో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హీరోయిన్ రష్మిక కూడా సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నది. ఈ వీడియోలో రష్మిక మాట్లాడుతూ.. ” ఏడాది క్రితం నా డీప్ ఫేక్ వీడియోని కొందరు నేరగాళ్లు వైరల్ చేశారని పేర్కొన్నారు. అది చాలా పెద్ద సైబర్ నేరమని, అప్పటి నుంచే ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాని చెప్పారు. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని వెల్లడించారు. కేంద్ర హోం అఫైర్స్ శాఖలో ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పని చేస్తున్నదని, ఆ సంస్థకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నానని పేర్కొన్నారు. సైబర్ నేరస్తులు ఎలా దాడి చేస్తారో ఎవరూ చెప్పలేరని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా.