JAISW News Telugu

YS Sharmila : మిగతా వారిని కూడా నరికేయండి..అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్..వదినపై మండిపడిన షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila : ఏపీలో ఈ సారి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఓ వైపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుంటే.. ఎలాగైనా తన అన్నను ఓడించి తన పార్టీని గెలిపించుకోవాలని వైఎస్ షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు ఓటర్లను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు రావడంతో ఈ సారి ఎన్నికల పై జనాలు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ.. తన సొంత చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. ఫ్యామిలీ రాజకీయ నాయకత్వం తనదేనని జగన్ తేల్చేశారు. తాను కుటుంబ రాజకీయానికి నేతృత్వం వహిస్తున్నప్పుడు.. తమ కుటుంబం నుంచి షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదన్నది జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం.

అయితే షర్మిల కూడా ఎక్కడా తగ్గడం లేదు. సొంత అన్నపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కడపలో ఆమె ప్రసంగాలు హీట్ పెంచుతున్నాయి. కడపలో వైఎస్ కుటుంబం ఇలా ప్రత్యర్థులుగా మారుతారని అక్కడి ప్రజలు ఊహించలేదు. ఓ వైపు జగన్, భారతీ, మరోవైపు షర్మిల..ఇలా కుటుంబ పోరు గట్టిగానే సాగుతోంది. ముఖ్యంగా కడప, పులివెందులలో భారతి, షర్మిల వార్ నడుస్తోంది. ఇటీవల ప్రచారంలో భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీలో వైసీపీనే సింగిల్ ప్లేయర్ అంటూ భారతి చేసిన వ్యాఖ్యలకు షర్మిల గట్టి కౌంటర్ ఇచ్చారు. గొడ్డలితో వైఎస్ వివేకానందరెడ్డిని నరికేసినట్టు మిగతావాళ్లను కూడా నరికేయండి అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అంటూ షర్మిల ఎద్దేవా చేశారు.

ఏపీలో వాళ్లే అధికారంలో ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నారని, ఇక వాళ్లే అధికారంలో ఉండాలని అనుకున్నప్పుడు వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరినీ నరికేయాలి అంటూ పేర్కొన్నారు. భారతి స్ట్రాటజీ ఇదేనా అంటూ షర్మిల ప్రశ్నించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలంటే తనకు ఓటు వేయాలని, ఎంపీని జైలులో కలువాలనుకుంటే అవినాశ్ రెడ్డికి ఓటేయాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈసారి కడప బిడ్డలు ఆలోచన చేయాలని, నేరాలు చేసిన వారికి  అవకాశం ఇవ్వకూడదని సూచించారు.

Exit mobile version