JAISW News Telugu

Governance : బూతులు తిట్టడం, కౌంటర్లు వేయడం..ఇదే కదా సార్ మీ దృష్టిలో పాలన అంటే..!

Governance

Governance Means in YCP Leaders,

Governance Means in YCP : తనకు నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన సీఎం జగన్ కు తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అభినందనలు చెప్పారు. ఇదే సందర్భంగా ఓటర్లకు తన ‘విలువైన’ సందేశాన్ని ఇచ్చారు. తనను నమ్మి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు తాను ఇన్నాళ్లు చేసిందేమిటో, వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తే ఏం చేయబోతున్నారో ఇప్పుడే ఓ క్లారిటీ ఇవ్వడం ‘విశేషం’.

‘‘నన్ను నెల్లూరు టౌన్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు అసెంబ్లీకి వెళ్లి చంద్రబాబును తిట్టాను..ఇక ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ కు వెళ్లి అక్కడా బాబును తిడుతాను’’ అంటూ ఉత్సాహంగా సెలవిచ్చారు. తనను నమ్మి ఓటేసిన ప్రజలకు ఓ ప్రజాప్రతినిధి ఏవిధంగా పనిచేయాలో, అలా గెలిచిన నాయకులు వైసీపీలో ఏ విధంగా పనిచేస్తారో తెలియని వారికీ ఒక్క ముక్కలో చెప్పేశారు అనిల్ కుమార్. ఈ విషయంలో ఇప్పటికే ఏపీ ప్రజలు కూడా ఓ అవగాహనకు వచ్చారనే అనుకోవాలి. తమ ఓటుకు వైసీపీ నాయకులు ఇచ్చే విలువ తెలుసుకున్న ఏపీ ప్రజలు ఈ సారి ఇటువంటి నాయకులను గెలిపించి తమ ‘ఓటు విలువను తగ్గించుకుంటారో?’’ లేక పాలనపై దృష్టి పెట్టే నాయకులకు అండగా నిలబడి  ‘ఓటు విలువను పెంచుకుంటారో’ ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, ఎంపీ విజయ సాయిరెడ్డి.. ఇలా వైసీపీ తరుపున గెలిచిన ప్రజాప్రతినిధులు అందరు తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తే వారి నుంచి వచ్చే సమాధానం.. మేము చంద్రబాబును బూతులు తిట్టాం, పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రజలకు వివరించాం..

జగన్ తాను అర్జునుడిని అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ‘‘వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పడేసే మీకెందుకండి రామాయణ, మహాభారత ఉదాహరణలు’ అంటూ జనసేన నేత నాగబాబు తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దానికి వెంటనే అంబటి రాంబాబు స్పందిస్తూ..‘పవిత్ర దీపారాధనతో సిగరెట్ ముట్టించుకునే మీకెందుకు సార్ ఈ ఉదాహరణలు’’ అంటూ కౌంటర్ వేశారు.

ఇలా పక్క పార్టీ నేతల మీద కౌంటర్లు వేయడంపై ఉన్న శ్రద్ధ పాలన మీద పెడితే ఎప్పుడో పొలవరం పూర్తయ్యేది. రాజధాని సమస్య కొలిక్కివచ్చేది. కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యేవి. మౌలిక సదుపాయాలు కల్పించేవారు.. అంటూ వైసీపీ నేతలపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీ దృష్టిలో పాలన అంటే తిట్లు, కౌంటర్లేనా సార్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. దాని కోసం మేము ఓటేయ్యాలా సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version