Pat Cummins : సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కమిన్స్.. జట్టు దశ తిరిగినా?
Pat Cummins : మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సమ్మర్ లో క్రికెట్ మజాను అనుభవించేందుకు అంతా రెడీ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ఎడెన్ మర్క్ రమ్ పై వేటు వేసింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ను కెప్టెన్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన కమిన్స్ కు పగ్గాలు అప్పగిస్తున్నట్లు సోమవారం ఎస్ఆర్ హెచ్ ప్రకటించింది. 17వ సీజన్ లో శుభ్ మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఇక మిగిలిన టీంలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు పాట్ కమిన్స్ ను వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా అంతర్జాతీయ ఆటగాడు ఐడెన్ మార్క్ రామ్ స్థానంలో కమిన్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. డిసెంబర్ 2023లో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో, వరల్డ్ కప్ ఫైనల్ స్టార్ ట్రావిస్ హెడ్ ను కూడా ఎస్ఆర్ హెచ్ సొంతం చేసుకుంది.
ఎస్ఆర్ హెచ్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా:
1. ట్రావిస్ హెడ్ (రూ.6.8 కోట్లు)
2. వనిందు హసరంగా( రూ.1.5కోట్లు)
3. పాట్ కమిన్స్ (రూ.20.5 కోట్లు)
4. జయదేవ్ ఉనద్కత్ (రూ.1.6 కోట్లు)
5. ఆకాశ్ సింగ్ (రూ.20లక్షలు)
6. జాతవేద్ సుబ్రహ్మణ్యన్ (రూ.20 లక్షలు)
కమిన్స్ రాకతో సన్ రైజర్స్ హైదరాబాద్ రాత మారిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన కమిన్స్ వ్యూహాలు ఐపీఎల్ లో వర్క వుట్ అయితే ఎస్ఆర్ హెచ్ కు తిరుగుండదని భావిస్తున్నారు. అలాగే ఆటపరంగా కూడా దూకుడైన క్రికెటర్లు ఉండడం జట్టుకు దోహదం చేస్తుందంటున్నారు.