Tirumala : నడకదారి మార్గంలో భక్తుల కోసం కీలక నిర్ణయాలు..!!

Tirumala

Tirumala

Tirumala : కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలనపై పూర్తి దృష్టి కేంద్రీకరించింది. దాంతో పాటు తిరుమలలో కూడా అవసరమైన మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా నియమితులైన ఈవో శ్యామలా రావు భక్తుల సదుపాయాలు.. దర్శనం.. ప్రసాదం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. అదే సమయంలో సామాన్య భక్తులకు తక్కువ సమయంలో దర్శనం కల్పించే దిశగా తీసుకోవాల్సిన చర్యల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. తిరుమల నడక మార్గంలో వచ్చే భక్తులకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలిపిరి, శ్రీవారి మెట్ల నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు సూచించారు. నడక మార్గంలో కొన్ని నెలలుగా నెలకొన్న పరిస్థితుల పైన అధికారుల నుంచి ఆరా తీశారు.  

ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఏడవ మైలు వరకు సంచరించే జంతువుల కదలికలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని  ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు.  జంతువుల కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రత విభాగానికి తెలియజేయడం ద్వారా భక్తులను హెచ్చరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కాలినడక మార్గంలో ఏయే సమయాల్లో భక్తుల రాకపోకలు అధికంగా / తక్కువగా ఉన్నాయి, ఏయే సమయాల్లో చిరుతలు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయో సమాచారం అటవీ శాఖ అధికారులు పీపీటీ ద్వారా తెలిపారు.  ఇందుకు సంబంధించి కాలినడక భక్తులకు నిర్దేశించిన సమయాల్లోనే తిరుమలకు చేరుకునేలా, ఆ సమయాల్లో మార్పులు చేయవలసిందిగా ఈవో దృష్టికి తీసుకువచ్చారు.

TAGS