Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం భక్తుల తాకిడి ఎక్కువయింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో మూడు రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈరోజు (శుక్రవారం) తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూలైన్ లోకి ఈరోజు ఉదయం 7 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 నుంచి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్ ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 5 గంటల సమయం పడుతుంది. రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న (గురువారం) తిరుమల శ్రీవారిని 58,637 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 21,956 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.69 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.