YS Sharmila : పంట నష్టపరిహారం ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి: వైఎస్ షర్మిల
YS Sharmila : ఏలేరు రైతులను నిండా ముంచిందని, వేల ఎకరాల నీట మునిగాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ఎకరాకు రూ.10 వేలు కాకుండా రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కండ్రుకోటలో ఆమె నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బాధిత రైతులతో మాట్లాడారు. ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్ కున్న చిత్తశుద్ధి చంద్రబాబు, జగన్ లకు లేదని విమర్శించారు. ఏలేరు రైతులను నిండా ముంచింది గత పాలకులేనని అన్నారు.
ఒక్కో రైతు ఇప్పటి వరకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారని, పెట్టుబడి మొత్తం వరదపాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారని, కనీసం రూ.25 వేలు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.