AP Police Arrested Btech Ravi : ఏపీలో పోలీసుల తీరుపై కొంత కాలంగా విమర్శలు వస్తున్నాయి. అధికార నేతల ఒత్తిడికి తలొగ్గి, ప్రతిపక్ష నాయకులపై కేసులతో వేధిస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నది. ప్రతిపక్ష నేతలను అత్యంత దారుణంగా అరెస్ట్ చేయడం, ఇండ్లలోకి, బెడ్రూంల్లోకి అర్ధరాత్రి పూట వెళ్లి అదుపులోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది.
ఇక తాజాగా బీటెక్ రవి అరెస్టు తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. ఏకంగా సీఎం జగన్ కు ఎన్నికల్లో ప్రత్యర్థిగా ఉన్న నాయకుడిపై ఇలా అదుపులోకి తీసుకోవడం అందరినీ విస్తుగొల్పింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా తీసుకెళ్లారని ఏపీ పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. ఎవరో చెప్పకుండా 20 మంది వచ్చి తీసుకెళ్లడంతో, అంతా కిడ్నాప్ అనుకున్నారు. ఆ తర్వాతే పోలీసులు తీసుకెళ్లారని తెలవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన నుంచి బయటపడ్డారు. ఒక పౌరుడిని ఇలా కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఎత్తుకెళ్లడం కూడా నేరమనే విషయం కూడా వారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అయితే పది నెలల క్రితం నమోదైన కేసులో బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇన్ని రోజులు బీటెక్ రవి అందుబాటులో లేరని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయన పులివెందులలోనే ఉన్నారని, వివిధ కార్యక్రమాల్లో బహిరంగంగానే పాల్గొన్నారని, ఇప్పుడు హడావిడిగా అరెస్ట్ చేయడం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని టీడీపీ ఆరోపిస్తున్నది. అయితే ఆయనకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఏపీలో పోలీసులు ప్రైవేట్ సైన్యంలా మారిపోయారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ ఇన్ చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి విషయంలోనూ వారి తీరు ఇలాగే ఉందని మండిపడుతున్నారు.
పది నెలల క్రిత ఎయిర్ పోర్టు వద్ద జరిగిన తోపులాట విషయంలో బీటెక్ రవిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిడి ఉందని, ఎలాంటి పక్షపాతధోరణి లేకుండా వ్యవహరించాల్సిన పోలీసులు ఇలా ఏక పక్షంగా కేవలం టీడీపీ నేతలను మాత్రమే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. బీటెక్ రవి ఫోన్లను కొన్ని రోజులుగా ట్యాప్ చేస్తున్నట్లు ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు కూడా. వైసీపీ అధినేత ప్రోత్సాహంతోనే ఇలా రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడుతున్నారని, అక్రమ కేసులు, బెదిరింపులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని టాక్ వినిపిస్తున్నది. ఇక పోలీస్ వ్యవస్థపై తీవ్ర స్థాయి లో విమర్శలు వస్తున్నాయి.