Alla Ramakrishna Reddy : ఆంధ్రప్రదేశ్ కు మొదటి ద్రోహి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆయన ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల్లో ఆళ్లకు మంగళగిరి నుంచి సీటు నిరాకరించడంతో..ఈయన తనదారి తాను చూసుకున్నాడు. షర్మిల బాటలో నడుస్తానని మీడియా ద్వారా ప్రకటించాడు. వైసీపీలో తనకు చేదు అనుభవం ఎదురైనప్పటికీ తాను వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటానని అందుకే షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు. తన నియోజకవర్గానిక రూ.8 కోట్ల దాకా అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేశానని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మంగళగిరి అభివృద్ధి పనులకు రూ.1,200 కోట్లు కేటాయిస్తానని చెప్పిన జగన్ రూ.125కోట్లే కేటాయించారని కూడా చెప్పారు.
ఒకే ఇంతవరకు ఆయన వర్షన్ లో బాగానే ఉన్నా..ఈయన వల్ల ఏపీ ప్రజలకు ముఖ్యంగా మంగళగిరి ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎవరైనా మరిచిపోతారా? రాజ్యాన్ని మించిన రాజభక్తి ప్రదర్శించి..ఆయన చేసిన తప్పుల చిట్టా చిరిగిపోతుందా? విభజన తర్వాత రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రజాప్రతినిధుల్లో మొదటి ద్రోహి ఆయనే. రాష్ట్ర రాజధాని విషయంలో ఆళ్ల చేసిన ద్రోహం మరే నాయకుడు చేయలేదనే చెప్పాలి.
సీఎం జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గానికి ఇచ్చిన మాట తప్పారు అని పదవి కాలం పూర్తయిన తర్వాత గుర్తుకొచ్చిందా? వైసీపీ నుంచి సీటు ఇవ్వను పో అన్న తర్వాత నియోజకవర్గం గుర్తుకొచ్చిందా అని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ నియోజక వర్గ పరిధిలోనే అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంటే.. దాని వల్ల మొట్టమొదట ప్రయోజనం పొందేది తన నియోజకవర్గ ప్రజలు అని తెలిసినా కూడా ఎన్ని కుయుక్తులు పన్నారని ప్రజలు నిలదీస్తున్నారు. కుల విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడి నిలువునా రాజధాని పనులకు మోకాలడ్డింది రామకృష్ణారెడ్డి కదా అని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయంగా తమ పార్టీకి అనుకూలురైన ఒక సామాజిక వర్గీయులైన 3 గ్రామాల రైతులను రెచ్చగొట్టింది నిజం కాదా? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. రాజధాని పనులు వేగవంతమైతే అప్పటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మైలేజ్ వస్తుందని భావించి, లాండ్ పూలింగ్ కు సహకరించవద్దని వారిని సహాయ నిరాకరణ చేయించి సీడ్ ఆక్సిస్ రోడ్ పనులు ముందుకు సాగనివ్వకుండా చేయలేదా అని నిలదీస్తున్నారు.
కృష్ణానదికి వరద వస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆ వరద సక్రమంగా డిశ్చార్జ్ కాకుండా అడ్డంకులు సృష్టించి, అప్పటి సీఎం చంద్రబాబు ఇల్లును ముంచడం ద్వారా అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేయడానికి ప్రయత్నించలేదా అని అడుగుతున్నారు. అమరావతి నిర్మాణంలో ఏదో అవినీతి జరిగిందని అపొహ పడి అప్పటి సీఎంపై రోజూ కేసుల మీద కేసులు వేసి ఇప్పటికీ వాటిని సమర్థించుకోవడం ఎంతవరకు సబబు అని ప్రజలు అంటున్నారు.
అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూసేకరణ కూడా జరగకున్నా దానిలో అవినీతి జరిగిందని కూడా కేసు ఫైల్ చేయడంతో పాటు సదావర్తి భూములు టీడీపీ నేతలు కొట్టేశారని ని కోర్టుకు వెళ్లి అక్కడా మొట్టికాయలు తిన్నది మరిచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలంతా రాజధాని కోసం ఉద్యమ బాట పట్టి దీక్షలు చేస్తుంటే..ఒక్కసారైనా మద్దతు పలికారా? అని జనం మండిపడుతున్నారు. మీ సొంత నియోజకవర్గంలో రాష్ట్ర రాజధాని ఉంటే దాని వల్ల ప్రజలకు పలు ప్రయోజనాలు, నాయకుడిగా మీకు ఎంతో పేరు వచ్చేది..ఒక్కసారైనా ప్రజల గురించి ఆలోచించారా? ఎమ్మెల్యేగా ఆళ్ల చేసిన పనులు వల్ల నేటీకి రాష్ట్రానికి రాజధాని ఏదంటే..ఏం చెప్పాలో తెలియన దుస్థితి ప్రజలకు కలుగలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రానికి దేశీయ, విదేశీ పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడుతారా? రాష్ట్రంలో ఉపాధి కల్పన లేక యువత బయటకు వెళ్లిపోవడం లేదా? దీనికి బాధ్యులు మీరు కాదా? అని మండిపడుతున్నారు. ఆర్కే చేసిన తప్పులు క్షమించరానివని, దాంతో యావత్ ఆంధ్రజాతికి తీవ్ర నష్టం జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. దాని పర్యవసనాలను ఆయన ఎదుర్కొక తప్పదని ప్రజలు హెచ్చరిస్తున్నారు.