KRK:వివాదాస్పద స్వయం ప్రకటిత క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (KRK) సినిమా సమీక్షలు, సోషల్ మీడియా పోస్ట్‌లతో నిరంతరం వార్తల్లో ఉంటాడు. అతడికి ఖాన్ ల త్రయంలో అందరితో గొడవలున్నాయి. ఇటు ప్రభాస్ ని కూడా చాలా సార్లు విమర్శించాడు. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన సమాచారం బయటకు లీకైంది. KRK ని ముంబైలో అరెస్టు చేసారనేదే ఈ సమాచారం. X లో ఒక పోస్ట్‌ను షేర్ చేసిన అతడు స్వయంగా ఈ సమాచారాన్ని అందించారు.
కేఆర్కే షేర్ చేసిన పోస్ట్‌లో తనను 2016 సంబంధిత కేసులో ముంబైలో అరెస్టు చేసినట్లు చెప్పారు. జైలులో నా ప్రాణం పోతే హత్యే అని కూడా కేఆర్కే తీవ్ర ఎమోషనల్ అయ్యారు. ఇది కాకుండా సల్మాన్ ఖాన్ చిత్రం టైగర్ 3 గురించి ప్రస్థావించాడు. KRK ఇలా రాసాడు. `నేను గత ఏడాది కాలంగా ముంబైలో ఉన్నాను. నేను క్రమం తప్పకుండా కోర్టుకు నిర్ణయించిన తేదీలకు అటెండవుతున్నాను` అని తెలిపాడు.
KRK ఇంకా ఇలా రాసాడు. ఈ రోజు నేను న్యూ ఇయర్ కోసం దుబాయ్ వెళ్తున్నాను. కానీ ముంబై పోలీసులు విమానాశ్రయంలో నన్ను అరెస్టు చేశారు అని రాసాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016 నాటి ఓ కేసులో నేను వాంటెడ్.. నా వల్లే తన టైగర్ 3 సినిమా ఫ్లాప్ అయిందని సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను పోలీస్ స్టేషన్‌లోనో, జైలులోనో చనిపోతే అది హత్య అని మీరంతా తెలుసుకోవాలి. మరి దీనికి బాధ్యులెవరో మీ అందరికీ తెలియాలి!.. అని రాసాడు.
KRK తన ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ – హోం మంత్రి అమిత్ షాలను కూడా ట్యాగ్ చేశారు. KRK ఈ పోస్ట్‌పై నెటిజనులు రకరకాలుగా కామెంట్ చేసారు. ఒక నెటిజన్ ఇలా రాసాడు. `మీ సోదరుడి పేరును పాడు చేయవద్దు` అని రాయగా, మరొక నెటిజన్ ఇలా రాసారు. `ఇదంతా నాటకం… ప్రజలు ఎప్పుడు నిజాలు మాట్లాడతారో, ఫేక్ పబ్లిసిటీ కోసం ఇలాంటి డ్రామాలు ఎప్పుడు ఆడతారో అర్థం కావడం లేదు` అని రాసాడు. మరొక నెటిజన్ X`లో ఏమీ రాయవద్దని నేను ఇప్పటికే మీకు చెప్పాను, ఇవి మీ స్వంత చర్యలు. ఆనందించండి!` అని వ్యాఖ్యానించాడు.