Crime News : శిశువును అపహరించిన ముగ్గురి అరెస్టు
Crime News : అమ్మ ఒడిలో నిద్రిస్తున్న శిశువును అర్ధరాత్రి అపహరించిన దంపతులుతో పాటు మరో మహిళను ఆర్జీఐఏ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అపహరించిన శిశువును విక్రయించడానికి యత్నించిన ముగ్గురిని సీసీ కెమెరాలు పట్టించాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కె.నారాయణరెడ్డి వెల్లడించారు.
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లికి చెందిన దండు హన్మంతరావు-చందన దంపతులు సిద్ధాంతిలో అద్దె గదిలో ఉంటున్నారు. హన్మంతరావు సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తుండగా చందన ఇంటి వద్దే ఉంటోంది. మద్యం, జల్సాలకు అలవాటు పడిన వీరు సులభంగా డబ్బులు సంపాదించాలని శిశువుల అపహరణ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 27న శంషాబాద్ లోని వంతెన కింద నిద్రిస్తున్న కర్నూలుకు చెందిన దంపతుల నెల వయసున్న చిన్నారిని వదిన స్వాతి, భార్య చందనలతో కలిసి హన్మంతరావు అపహరించాడు.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 42 సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి హన్మంతరావు, చందన, స్వాతిలను అరెస్టు చేశారు. నాలుగు రోజుల తర్వాత తల్లి ఒడికి శిశువు చేరడంతో ఆ దంపతులు ఆనందపరవశులయ్యారు. శిశువు అపహరణ కేసును చాకచక్యంగా ఛేదించిన ఏసీపీ కె.శ్రీనివాసరావు, ఆర్జీఐఏ ఇన్ స్పెక్టర్ బాల్ రాజ్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.