Kavitha Bail : ఢిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకుని అల్లల్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. ఓవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు ఉచ్చు బిగించాలని ఈడీతో పాటు సీబిఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని బెయిల్ కోసం కవిత కోర్టులతో ఏకంగా పోరాటమే చేస్తుంది. సీబీఐ, ఈడీ కేసులో బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో కవిత దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మరోమారు కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో అయినా కవితకు బెయిల్ వస్తుందా రాదా అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. మార్చి 15న ఈ కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఈ కేసు ఊబిలో కూరుకుపోతూనే ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ కేసును, అవినీతి ఆరోపణలతో సిబిఐ కేసును ఎదుర్కొంటున్న, కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో 24వ తేదీ విచారణ జరగింది. ఈ కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టును గడువు కోరింది. నేడు సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.
మరోవైపు ఇప్పటికే ఈడీ కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించడానికి రెడీగా ఉంది. నేడు ఢిల్లీ హైకోర్టు ముందు కవిత సీబీఐ కేసులోనూ, ఈడీ కేసులోనూ బెయిల్ పిటిషన్ ల పైన లాయర్ విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించనున్నారు. నేడు జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ఈ కేసులో వాదనలను విననున్నారు. రెండు కేసులలో సోమవారం కవిత తరపున వాదనలు పూర్తి చేయాలని కోర్టు సూచించింది. కోర్టు సూచించిన క్రమంలో విక్రమ్ చౌదరి కవిత తరపున వాదన వినిపించనున్నారు. రేపు ఈడీ, సీబీఐ వాదనలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నిస్తున్న కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది త్వరలోనే తెలియనుంది.