Couple Adventure for Vote : హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న లక్ష్మణరావు ఆయన భార్య కనకలక్ష్మీతో కలిసి ఓటువేసేందుకు ద్విచక్ర వాహనంపై సాహస యాత్ర చేశారు. ముందుగా లక్ష్మణరావు దంపతులు వారి స్వగ్రామం బిక్కవోలు మండలం కొంకుదురు వెళ్లడానికి శనివారం ఉదయం 5 గంటలకే బస్టాండుకు చేరుకున్నారు. ఏ బస్సు ఖాళీ లేదు. రిజర్వేషన్లు అసలే లేవు. ఉదయం 10 గంటల వరకు బస్టాండ్ లోనే బస్సుల కోసం వెయిట్ చేశారు. ఫలితం లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయారు. ఓటు వేయాలంటే ఎలాగైనా కొంకుదురు వెళ్లాలి. లేదంటే హైదరాబాద్ లోనే ఉండిపోవాలి. కొంకుదురు వెళ్లాలంటే వారికి ఒకే ఒక మార్గం కనిపించింది అది వారికున్న కైనెటిక్ హోండా వాహనం.
దాదాపు 500 కి.మీ. ద్విచక్ర వాహనంపై వెళ్లగలమా అని ఆలోచించారు. ఉదయం 11 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై బయలుదేరి సాహసం చేశారు. ప్రతి 50 కి.మీ. దూరానికి ఒకసారి ఆగి నీళ్లుతాగి అరగంట విశ్రమించి తిరిగి ప్రయాణం సాగించారు. అలా విజయవాడ వెళ్లేసరికి రాత్రి 11.30 గంటలయింది. రెండు గంటల నిద్ర అనంతరం తిరిగి ప్రయాణం సాగించి ఉదయం ఆరు గంటల ప్రాంతంలో రామచంద్రపురం అత్తవారి ఇంటికి చేరారు. అక్కడ సేదతీరి టిఫిన్ చేసిన తర్వాత కొంకుదురు గ్రామానికి తొమ్మిది గంటలకు చేరారు. ఓటు వేయడం కోసం ఇంత సాహసయాత్ర చేసిన వీరు ఓటు వేయడానికి బద్దకించే వారికి ఆదర్శంగా నిలిచారు.