PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారానికి చాలా ప్రాధాన్యమిస్తారు. ఆయన విజయాలకు ప్రధాన కారణాల్లో ప్రచారానిదే సింహభాగం. ఆయన ఎక్కడికెళ్లినా ఫొటో షూట్ ఉండాల్సిందే. దాన్ని ఇక బీజేపీ శ్రేణులు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో గ్రూపు గ్రూపుకి తిప్పుతుంటారు. ఈవిషయమై ఆయన ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శిస్తుంటారు.
ఈమధ్య ఆయన ప్రచార తీరు మారి ఎబ్బెట్టుగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఫొటో షూట్లపై చర్చలు కూడా ఎక్కువగానే సాగుతున్నాయి. యువతలో ఉన్న సెల్ఫీ మోజును ఉపయోగించుకుని ప్రచారం పొందేందుకు మోదీ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నెలల కింద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కళాశాలలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదేమంటే దేశం పలు రంగాల్లో సాధించిన విజయాలపై యువతలో అవగాహన కలిగించేందుకు ప్రధాని మోదీ 3డీ ఫొటోతో కూడిన సెల్ఫీ పాయింట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సెల్ఫీ పాయింట్ల వద్ద ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఆదేశించింది. అందరూ ఇదేమిటని ప్రశ్నించడంతో యూజీసీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
ఇప్పుడు సెంట్రల్ రైల్వే డిపార్ట్ మెంట్ తమ 19జోన్లలో ఉన్న స్టేషన్ లలో 3డీ మోడీ సెల్ఫీ బూత్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఏర్పాటూ మొదలైంది. ఒక్క సెల్ఫీ పాయింట్ కు రూ.6లక్షలు ఖర్చు చేశారు. సాధారణ ప్రజలు ప్రయాణించేందుకు రైళ్లను పెంచకపోగా అనేక రైళ్లను రద్దు చేశారు. రైళ్లలో కిక్కిరిసిపోయి జనాలు ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ పట్టని రైల్వే శాఖ సెల్ఫీ పాయింట్ ల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రక్షణ శాఖ కూడా ఇలాగే తమ విభాగాలకు సెల్ఫీ పాయింట్లు పెట్టాలని సూచనలు జారీ చేసింది. ఎయిర్ పోర్టులు, మ్యూజియంలు, మార్కెట్లు, స్కూళ్లు ఇలా అన్ని కేంద్రాల్లో మోదీ బొమ్మతో 3డీ ఎఫెక్ట్ తో ఈ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం తదితర ఇబ్బందులతో దేశ ప్రజలు ఉంటే కేంద్రం మాత్రం ఏదో గొప్ప అభివృద్ధి జరిగింది అన్నట్టుగా సెల్ఫీ పాయింట్లు పెడుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.