Counting Day : జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా విజయవాడలోని రద్దీగా ఉండే బీసెంట్ రోడ్డు ఖాళీగా కనిపించింది. కౌంటింగ్ నేపథ్యంలో దుకాణాలన్నీ మూతపడి, తోపుడు బండ్ల వ్యాపారులు తమ వ్యాపారాలను తెరవలేదు. మధ్యాహ్నం వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కౌంటింగ్ కొనసాగుతుండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కౌంటింగ్‌లో జరిగే హింసాత్మక ఘటనలపై కేంద్రం, ఇంటెలిజెన్స్ అధికారులు ముందే అప్రమత్తం కావడంతో రాష్ట్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, ప్రధాన జంక్షన్ల వద్ద హోటళ్లు, దుకాణాలు, ఇతర సంస్థలను మూసి వేయించారు. అన్ని ప్రధాన రహదారులు, కేంద్రాల వద్ద పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
పోలీస్ చట్టంలోని సెక్షన్ 144, సెక్షన్ 30ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి హింసాయుత ఘటనలు జరగకుండా పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్), ఆర్మ్‌డ్ రిజర్వ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
అన్ని జిల్లాల్లో ఐజీ, డీఐజీలు, పోలీస్ సూపరింటెండెంట్లు కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. పోలీసులు కమాండ్ కంట్రోల్ రూమ్‌ల నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, కృష్ణా తదితర జిల్లాల్లో పలు చోట్ల భారీ పోలీసు బలగాలు కనిపించాయి.
విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం ‘ఆంధ్రరత్న భవన్’ కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నిర్మానుష్యంగా మారింది. పార్టీ నాయకులు గానీ, పెద్దలు గానీ, ప్రముఖులు గానీ ఎవరూ కార్యాలయం వైపు రాలేదు.