Weather Report : దాదాపు రెండు నెలలుగా ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఎడారి దేశమైన రాజస్తాన్ లో దాదాపు 52 డిగ్రీల వరకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా కూడా ప్రజలు బయటకు రావడం లేదు. వీలైనంత వరకు ఉదయం, రాత్రి వేళ్లల్లో మాత్రమే అవసరాల కోసం బయటకు వస్తున్నారు. ఈ సంవత్సరం (2024) ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. ఉదయం 6 గంటల నుంచే వేడి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లటి కబురు తెచ్చింది.
సాగుకు ప్రధాన ఆధారమైన నైరుతి రుతుపవనాలు దేశ ప్రధాన భూ భాగంలోకి ప్రవేశించినట్లు వాతావరణ శాఖ ఐఎండీ (IMD) తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళను తాకినట్లు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్ తో పాటు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఇప్పటికే అంచనా వేసింది. రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఈ కబురు ఊరట కల్పించింది.
దేశంలో 52 శాతం సాగు భూమి ఇప్పటికీ వర్షం పైనే ఆధారపడి పంట ఇస్తుంది.
వ్యవసాయ ఉత్పత్తిలో దీని నుంచే 40 శాతం దిగుబడి వస్తుంది. అందుకే దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలకం. ఇక, ఈ ఏడాది ‘లానినా’ అనుకూల పరిస్థితులు, భూ మధ్య రేఖ వద్ద పసిఫిక్ మహా సముద్రం చల్లబడడం ఆగస్ట్-సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది.
1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత ‘లానినా’ వచ్చిన సందర్భాల్లో భారత్‌లో 9 సార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని ఐఎండీ వివరించింది.