Beer Flavors : సమ్మర్ లో కూల్ న్యూస్.. బీర్ కొత్త ఫ్లేవర్లు వచ్చేశాయ్..
Beer Flavors : ‘బీరు’ ఈ పేరు వింటేనే మందు తాగే వారికి ఉత్సాహం ఉంటుంది. అసలే సమ్మర్.. మండుతున్న ఎండలో చిల్డ్ బీరు తాగితే ఆ మజానే వేరు. బీరును ఎక్కువగా యువత ఇష్టపడతారు. సరదాగా ఫ్రెండ్స్ తో కూర్చున్న సమయం, పండుగలు, ఇంకా పరిస్థితులను బట్టి బీరుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు యూత్. మద్యం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే. కానీ మితంగా తీసుకుంటే బీరు అంతగా హానికరం కాదని చెప్తున్నారు. ఒక గ్లాసు బీరు సులభంగా, ఆనందంగా గడిపేందుకు సాయపడుతుందట.
దీంతో బీరు ప్రియులను ఆకట్టుకునేందుకు తయారీ సంస్థలు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. సాధారణంగా ఒకే రకమైన టేస్ట్ ఉన్న బీర్ తీసుకునే కొద్దీ దానిపై ఆసక్తి తగ్గుతుంది. అందుకే తయారీ సంస్థలు కొత్త కొత్త ఫ్లేవర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. భారత్‌కు చెందిన కొన్ని బీర్ కంపెనీలు స్థానికంగా ప్రజలు ఇష్టపడే ఫ్లేవర్స్‌తో వస్తున్నాయి. దీంతో ఒకే టేస్ట్ ఉండే బీర్ కాకుండా.. రకరకాల ఫ్లేవర్స్‌తో ఉండే బీర్‌ను తీసుకోవచ్చు.
రుచి కోసం..
బీర్‌కు మంచి రుచి జోడించేందుకు తయారీ సంస్థలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలు ఎక్కువుగా ఇష్టపడే ఫ్లేవర్స్‌లో బీర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. స్వదేశీ క్రాఫ్ట్ బీర్ కంపెనీ బీరా-91 చట్నీ సోర్ విడుదల చేసింది. తక్కువ సంఖ్యలో వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చింది. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఎక్కువ మంది చట్నీ ఇష్టపడతారు. అందుకే చట్నీ ఫ్లేవర్‌లో బీర్స్ తయారు చేసింది బీరా-91. ఈ బీర్ తయారీకి చింతపండు వాడారు. కొత్త ఫ్లేవర్స్‌లో బీర్‌లు తయారు చేసేందుకు బిరా-91 అమెరికా కేంద్రంగా ఉన్న క్రాఫ్ట్ బ్రూవర్ న్యూ బెల్జియం బ్రూయింగ్‌తో కలిసి పనిచేస్తుంది. అమెరికాలోని కొలరాడో ప్రాంతం బీర్ల ఆవిష్కరణకు కేంద్రంగా ఉంది. అమెరికాలో అత్యంత గుర్తింపు పొందిన బీర్ల కంపెనీగా న్యూ బెల్జియం బ్రూయింగ్ సంస్థ ఉందని బిరా-91 వ్యవస్థాపకుడు, CEO అంకుర్ జైన్ తెలిపారు.
గతంలోనూ..
బిరా-91 వివిధ ఫ్లేవర్స్‌తో బీర్లను తయారు చేయడం మొదటి సారి కాదు. ఈ కంపెనీ 2022లో ‘బాలీవుడ్ IPA’, ‘కోకుమ్ సోర్’, ‘బ్రౌన్ ఆలే’ ‘మ్యాంగో లస్సీ’ అనే నాలుగు కొత్త రుచులతో బీర్లను అందుబాటులోకి తెచ్చింది. కాలానుగుణంగా లభించే పండ్లు, వివిధ రుచికర పదార్థాలతో బీర్లు తయారు చేయడం ద్వారా భిన్న రుచులతో కూడిన అల్కాహల్ అందించాలనే బీరా-91 ఓ ప్రయత్నం చేస్తోంది. ఈ బీర్లకు భారత్‌లో ఆదరణ లభిస్తోందని సంస్థ తెలిపింది.
కాఫీ ఫ్లేవర్స్..
బీరా-91 పండ్లకు సంబంధించిన ఫ్లేవర్లే కాకుండా కాఫీ ప్లేవర్స్ బీర్లను కూడా తయారు చేస్తోంది. మలబార్ కొండల్లో లభించే కాఫీ పొడి, కొత్తి మీర గింజలతో ఈ సంస్థ బీర్లను తయారు చేసింది. బీరా-91తో పాటు మరో బీర్ల తయారీ సంస్థ కాటి పతంగ్ సాఫ్రాన్ లాగర్, జెస్టీ అంబర్, స్నాపీ వీట్, బరేలీ బోల్డ్ అనే నాగులు బ్రాండ్లతో తయారు చేస్తోంది. స్నాపీ వీట్ బీర్‌లో పెప్పర్ కార్న్, కొత్తి మీర వంటి సేంద్రియ భారతీయ మసాలా దినుసులను జోడించడం ద్వారా కొత్త రుచులు కలిగిన బీర్లను తయారుచేస్తోంది.
కొత్త ప్రయోగాలు..
భారతీయ బీర్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. దీన్ని మరింత విస్తరించేందుకు అవకాశాలున్నాయని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి కాలంలో మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఎక్స్‌పర్ట్ మార్కెట్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం.. 2023లో భారతీయ బీర్ మార్కెట్ విలువ రూ. 483.10 బిలియన్లు ఉండగా.. 2032 నాటికి రూ. 1122.52 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.