Veena Reddy : భారత్ ఎన్నికల్లో అమెరికా ఆర్ధిక సాయం వివాదం.. ఎవరీ వీణారెడ్డి?

Veena Reddy

Veena Reddy

Veena Reddy : భారతదేశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే లక్ష్యంతో అమెరికా అందించనున్న ఆర్ధిక సాయంపై తీవ్ర వివాదం చెలరేగింది. అధికార భాజపా (బీజేపీ),  ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ఏఐడీ) ద్వారా 21 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 187 కోట్లు) సహాయం అందించేందుకు ప్రణాళిక వేసినట్టు వార్తలు వెలువడాయి. అయితే, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికా గవర్నమెంట్ ఎఫిషియెన్సీ విభాగం (డోజ్) ఈ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. అంతేకాకుండా, భారత ఎన్నికల్లో జో బైడెన్ జోక్యం చేసుకున్నారని పరోక్షంగా ఆరోపించడం రాజకీయ వర్గాల్లో పెనుచర్చకు దారి తీసింది. ట్రంప్ ప్రకారం, భారత్‌లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఇచ్చిన ఆర్ధిక సహాయం ఎవరిని గెలిపించడానికి ఉపయోగపడిందో తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

– వివాదంలో వీణారెడ్డి పేరు

ఈ వ్యవహారంలో భారతీయ అమెరికన్ అయిన వీణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆమె 2021-24 మధ్య యూఎస్ఏఐడీ ఇండియా-భూటాన్ మిషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. బీజేపీ ఎంపీ మహేశ్ జఠ్మలానీ ఆరోపణల ప్రకారం, వీణారెడ్డి భారతదేశ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచే ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించారు. 2021లో భారత్‌కు వచ్చి, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లారని ఆయన పేర్కొన్నారు.

మహేష్ జఠ్మలానీ ఈ సందర్భంగా వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టి, అమెరికా ప్రభుత్వం భారత్‌లో ఎన్నికలకు జోక్యం చేసుకున్నట్లు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి గార్సెట్టితో కలిసి వీణారెడ్డి పని చేశారని ఆరోపించారు. అమెరికా ప్రభుత్వం యూఎస్ఏఐడీ ద్వారా భారత్‌లో ఓటింగ్ శాతం పెంచే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమనే అంశంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు.

– భాజపా, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు

ఈ అంశంపై భాజపా ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయా స్పందిస్తూ, ఈ సహాయం అధికార పార్టీకే ఉపయోగపడిందని తేల్చలేమని పేర్కొన్నారు. అయితే, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఆయన సీఈసీగా ఉన్న సమయంలో 2012లోనే ఎన్నికల కమిషన్, యూఎస్ఏఐడీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, భారత్‌లో ఎన్నికల విధానంలో విదేశీ జోక్యం ఉండకూడదన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అమెరికా సహాయం నిలిపివేయడం, వీణారెడ్డి పాత్రపై పెరుగుతున్న విమర్శలు, ట్రంప్ ఆరోపణలన్నీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

TAGS