Animal song in billboard:ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది యానిమల్. రణబీర్ కపూర్ నటించిన ఈ సినిమా అజేయంగా 500 కోట్ల షేర్ వసూళ్లను సాధించనుందని ఇప్పటికే రిపోర్టులు అందాయి. లాంగ్ రన్ లో 1000 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరుతుందని అంచనా. ఈ సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లలోనే కాదు.. పాటలతోను దాని స్థాయిని ఎలివేట్ చేస్తోంది.
తాజాగా ప్రతిష్ఠాత్మక బిల్ బోర్డ్ చార్ట్స్ లో `యానిమల్` సినిమాకి సంబంధించిన మూడు పాటలు టాప్5లో చోటు దక్కించుకున్నాయి. ఇందులో వివాదాస్పద గీతం అర్జన్ వెయిలీ టాప్ -1లో నిలవడం విశేషం. భూపేందర్ బబ్బల్ ఈ పాటను ఆలపించారు. టాప్ 3 పాటగా యానిమల్ నుంచి బి పార్క్ ఆలపించిన సారీ దునియా జాలా దేంగే.. రికార్డుల్లో నిలిచింది. అర్జున్ సింగ్ ఆలపించిన సత్రంగ.. గీతం టాప్ 5గా నిలిచింది. ఇక కింగ్ ఖాన్ షారూఖ్ నటించిన జవాన్ నుంచి అర్జిత్ సింగ్-శిల్పారావ్ ఆలపించిన చలియే.. పాట టాప్ 2 స్థానాన్ని దక్కించుకుంది. టాప్ 4 లో హరిహరన్ ఆలపించిన హనుమాన్ చాలీసా బిల్ బోర్డ్ లో స్థానం దక్కించుకుంది.
ఈ సంవత్సరం అతిపెద్ద యాక్షన్ సాగా యానిమల్ నుండి ఎపిక్ ఆల్బమ్ సౌజన్యంతో టాప్ 3 పాటలు బిల్ బోర్డ్ లో స్థానం దక్కించుకోవడం ఆసక్తికరం. యానిమల్ చిత్రాన్ని టిసిరీస్ తో కలిసి సందీప్ వంగా నిర్మించారు. సందీప్ వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రణబీర్ కపూర్ పాన్ ఇండియా కలల్ని నిలబెట్టిన తెలుగు దర్శకుడిగా సందీప్ వంగాకు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది.
అర్జన్ వైలీ వివాదం వెనక..
యానిమల్ సాంగ్ అర్జన్ వైలీ.. బిల్ బోర్డ్ లో టాప్ 1గా నిలిచింది. ఇది నిజానికి సంగీత ప్రియులకు ఇష్టమైన పాట. అయితే సిక్కు చరిత్రతో ఈ పాట అనుబంధం వివాదానికి తెరతీసింది. ఈ పాట అర్థం దీనికి కారణం. నిజానికి డిసెంబర్ 1న సినిమా విడుదలకు కొన్ని వారాల ముందు ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. మూడు వారాల్లోనే అర్జన్ వైలీ పాట యూట్యూబ్‌లో 75 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. రిలీజ్ సమయానికి ఈ పాట యూట్యూబ్‌లోని మ్యూజిక్ విభాగంలో ట్రెండింగ్‌లో ఉంది.
మనన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ పాటను భూపీందర్ బబ్బల్ ఆలపించారు.. ఆయనే రాశారు. సినిమా ప్రీ-టీజర్‌లో ఇది మొదట వినబడినప్పుడు, పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ దానిని తన X ఖాతాలో మళ్లీ షేర్ చేసి విస్మ యం వ్యక్తం చేసాడు. పాటలోని ఒక లైన్‌ను ఉటంకిస్తూ .. “అర్జన్ వైల్లీ నే పెయిర్ జోడ్ కే గండాసి మారి ”.. `సవాద్ లేయా తా.. # రణబీర్ కపూర్ # సందీప్ రెడ్డి వంగా .. ఫైర్ వోకల్ # భూపిందర్ బబ్బల్` అని కూడా రాశాడు.
అయితే ఈ పాటపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ విమర్శలు గుప్పించారు. సిక్కుమతంలో పాటకు ప్రాముఖ్యత ఉన్నందున మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని ఫిర్యాదు చేసారు. రంజీత్ మాట్లాడుతూ.. అర్జన్ వాయిలీ.. మొఘలులకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సిక్కు దళం కమాండర్-ఇన్-చీఫ్, అతని కుమారుడు అర్జన్ సింగ్ నల్వా గురించిన పాట. విభజనకు ముందు పాకిస్థాన్ గుజ్రాన్‌వాలా నుంచి అనేక మంది ముస్లింలను రక్షించాడు. సినిమాలో ఈ చారిత్రాత్మక పాటను గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఉపయోగించారు. ఇది మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుంది“ అని వాదించారు. ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో తన ఎన్నికల విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బిజెపి ఈ పాటను ఉపయోగించడం ఇంకా వేడెక్కించింది.
అర్జన్ వైలీ.. ధాడి-వార్ సంగీతం నుండి తీసుకున్న పాట. ఇది సిక్కు సంప్రదాయ మూలాలను కలిగి ఉంది.సైనికులలో ధైర్యాన్ని నింపడానికి యుద్ధ నినాదంగా ప్రసిద్ధి చెందింది. పదవ సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కాలంలో మొఘలులపై పోరాటంలో ప్రజల మనోధైర్యాన్ని పెంపొందించడానికి ఈ ఉద్విగ్నమైన సంగీత శైలిని రూపొందించారు. వందలాది మంది శత్రువులతో ఒంటరిగా పోరాడే వ్యక్తిని, తప్పులను సరిదిద్దడానికి ఆయుధాలను పట్టుకోవడానికి భయపడని వ్యక్తిని లేదా అన్యాయానికి గురైన వ్యక్తి పక్కన నిలబడటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న వ్యక్తిని అర్జన్ వాయిలీ అంటారు.
అయితే, పురాణాల ప్రకారం.. అర్జన్ సింగ్ నల్వా అని కూడా పిలువబడే అర్జన్ వైల్లీ, సిక్కు ఖల్సా ఫౌజ్ కమాండర్-ఇన్-చీఫ్ హరి సింగ్ నల్వా కు నాల్గవ కుమారుడు. హరి సింగ్ ఒక బాకు సహాయంతో ఒంటరిగా పులితో పోరాడాడు. అతను ఒంటరిగా పులిని ఓడించడంతో బాగ్ మార్ అనే బిరుదును పొందాడు. 18వ శతాబ్దంలో మొఘలులతో పోరాడాడు. అతడి మరణం తరువాత, అర్జన్ సింగ్ తన తండ్రి బాధ్యతను స్వీకరించాడు. బ్రిటిష్ వారి నుండి సిక్కు రాష్ట్రాలను రక్షించాడు. చట్టానికి వ్యతిరేకంగా పోరాడటానికి భయపడని వ్యక్తికి వైల్లీ అనే పదం ఉపయోగిస్తారు.