Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు, నారాయణగిర షెడ్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ మీదుగా రింగ్ రోడ్డులో శిలాతోరణం సర్కిల్ వరకూ వ్యాపించి ఉంది. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది.
కాగా, శనివారం తెల్లవారుజామున ఉచిత దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో భారీ సంఖ్యలో భక్తులు బారులుదీరారు. శ్రీనివాసం, విష్ణునివాసం వద్ద రాత్రి 2 గంటల నుంచే భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. తిరుమలలోని అక్టోపస్ భవనం వద్దనున్న సర్కిల్ నుంచి శిలాతోరణం సర్కిల్ వరకు శ్రీవారి భక్తులను ఉచిత బస్సుల్లో చేరుస్తున్నారు.
క్యూలైన్ పొడవు అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తులు నడిచే అవసరం లేకుండా ప్రత్యేకంగా ఎనిమిది ఉచిత బస్సులను ఏర్పాటు చేసి భక్తులను తరలిస్తున్నారు. గడిచిన 10 రోజుల్లో శ్రీవారిమెట్టు, అలిపిరి నడక మార్గాల్లో దాదాపు 2.60 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీటీ ప్రకటనలో తెలిపింది.