YS Sharmila : చిన్నాన్న చివరి కోరికను తీర్చేందుకే ఎంపీగా పోటీ..అతన్ని ఓడించడమే టార్గెట్..షర్మిల తీవ్ర భావోద్వేగం

YS Sharmila

YS Sharmila

YS Sharmila : ఏపీ ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తున్నట్లు ఇడుపులపాయలో ప్రకటించిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. కడప జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా. అలాంటి చోట అన్నా, చెల్లెళ్ల సమరం సాగబోతుండడంతో సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. కడప ఎంపీగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన షర్మిల.. అందుకు గల కారణాలను వివరించే ప్రయత్నంలో భావోద్వేగానికి లోనయ్యారు.  తన నిర్ణయంతో ఏం జరుగుతుందో కూడా చెప్పారు. కడప కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల తన కుటుంబంలో చీలిక వస్తుందని భావిస్తున్నారు. కానీ పోటీ అనివార్యమైనందున తాను కూడా రంగంలో ఉంటున్నట్లు చెబుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు షర్మిల తనకు చెల్లి కాదు తల్లి అని సంబోధించిన తరువాత మారిపోయారు. అందుకే ఇప్పుడు వైఎస్ అభిమానుల్లో ఆందోళన పెరుగుతోంది. జగన్ తన రక్తమని చెప్పినా తరువాత ఆయనలో వచ్చిన మార్పుతోనే తాను పోటీలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి టికెట్లు ఇవ్వడం జగన్ నైజమని విమర్శిస్తున్నారు.

చిన్నాన్న వివేకాను హత్య చేసిన వారికి శిక్ష పడకుండా చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని వెనకేసుకు వచ్చి అతడికే మళ్లీ టికెట్ ఇవ్వడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. అధికారంలో ఉన్నందున జగన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. దీంతోనే కడప నుంచి పోటీలో నిలిచి వైసీపీ బలం తగ్గించడమే తన ఉద్దేశమన్నారు. వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక తనను ఎంపీగా చూడాలన్నదే చెబుతున్నారు.  

లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఉపయోగించుకుంటామన్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధిస్తామని పేర్కొన్నారు. జగన్ పాలనకు చరమగీతం పాటే సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలు జగన్ పాలనకు విసిగిపోయారు. దోపిడీ, దొంగతనాలు పెరిగిపోయాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పాలన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఆయువుపట్టు అయిన కడప జిల్లాలో రాజన్న ఇద్దరు బిడ్డలు సమరంలో తలపడబోతుండడంతో ఏపీ రాజకీయాలు మరింత ఉత్కంఠను సంతరించుకోబుతున్నాయి.

TAGS