Perni Nani : ఎమ్మెల్యే ను హత్య చేసేందుకు కుట్ర.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Perni Nani : ఓట్ల లెక్కింపు గడువు దగ్గరకు వస్తున్నా కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టి ఇప్పుడు కౌంటింగ్ డే మీదే ఉంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైసీపీ, ఇటు కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. ఏపీలో ఈ నెల 13న పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఈ క్రమంలో ఎన్నికల సమయంలో చాలా చోట్ల గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గుంటూరు జిల్లా మాచర్లలో చిన్న పాటి యుద్ధమే జరిగింది. మాచర్లలో ఎంతో మంది హత్యలకు… మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారంటూ ఓ వైపు రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే.. మరో వైపు వైసీపీ కొత్త సిద్ధాంతంతో తెరపైకి వచ్చింది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను హత్య చేయడానికి టీడీపీ కుట్ర పన్నిందని పేర్ని నాని మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు పోలీసులు కూడా సాయం చేస్తున్నారంటూ ఆరోపించారు.
ఇంకా ఓడిపోకముందే వైసీపీ ఇలా డీలా పడిపోయి తమ ఎమ్మెల్యేలను హత్య చేయాలనుకుంటున్నారని.. అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని చెప్పుకోవడం ఎవరికైనా కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే పిన్నెల్లి అరెస్టు కాకుండా చూడాలనుకునే ప్రయత్నంలో అధికార పార్టీ ఇందుకు కూడా దిగజారిపోయింది. తాము ఓడిపోతామన్నట్లుగా.. తమ వారి ప్రాణాలు కాపాడాలన్నట్లుగా మాట్లాడటం మొదలు పెట్టారు.
పిన్నెల్లి కోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టు షరతుల ప్రకారం ఆయన ప్రస్తుతం నర్సరావుపేటలో ఉండటం లేదు. ఇంకా పిన్నెల్లి తన ఆజ్ఞాతం వీడలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో వైసీపీ నేతలకు.. పోలీసు ఉన్నతాధికారులకు తప్ప మిగతా ఎవరికీ తెలియదు. కోర్టు ఒక్క కేసులోనే ముందస్తు బెయిల్ ఇచ్చిందని.. ఆయనపై హత్యాయత్నం కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఆయన కనిపిస్తే అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని కవర్ చేసుకోవడానికి పిన్నెల్లి హత్యకు కుట్ర అంటూ… పేర్ని నాని మీడియా సమావేశంలో ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాచర్లలో పిన్నెల్లి చేసిన అరాచకాల గురించి తెలిసిన వారు ఆయనపై కనీస సానుభూతి చూపించే ప్రయత్నం చేయరు.